ప్రతి ఫ్రెండ్.. అవసరమేనా?
దిశ, ఫీచర్స్ : వ్యక్తిత్వం, మంచి చెడులతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరి లైఫ్‌లో ఫ్రెండ్ ఫ్యాక్టర్ అనేది కామన్..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : వ్యక్తిత్వం, మంచి చెడులతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరి లైఫ్‌లో ఫ్రెండ్ ఫ్యాక్టర్ అనేది కామన్. ఉత్తములకే కాదు కరడుగట్టిన నేరస్తులకైనా ఒక ఆత్మీయ నేస్తం ఉంటుందంటే ఇది ఫ్రెండ్‌షిప్ గొప్పతనమే. ఒక వ్యక్తి స్నేహితులను బట్టే అతని క్యారెక్టర్‌ను అంచనా వేయొచ్చనే మాట అక్షరాల సత్యం. ఇక మనిషి కష్ట సుఖాల్లో ఫ్యామిలీ పాత్ర పక్కన బెడితే.. అప్ అండ్ డౌన్స్‌లో ఫ్రెండ్స్ ఇచ్చే ఎమోషనల్ సపోర్ట్ వెలకట్టలేనిది. స్వార్థంలేని స్నేహాలు మనసును తేలికపరిచి, ఒత్తిడి స్థాయిని తగ్గించవచ్చు. అవరోధాలను అధిగమించే ఆత్మవిశ్వాసాన్ని కల్పించి ముందుకు నడిపించవచ్చు. మొత్తానికి ఆరోగ్యకర మిత్రుత్వాలు విభిన్న పాత్రల ద్వారా జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాయి. కానీ నిజమైన నేస్తాలను కనుగొనడమే కష్టం. ఇంతకీ మెంటల్ హెల్త్‌కు సైతం తోడ్పాటునందించే అసలు సిసలైన ఫ్రెండ్స్‌ను గుర్తించడం ఎలా? ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారు?
మానసిక ఆరోగ్యం కోసం ఏ రకమైన స్నేహితులు ఉత్తమం అనే విషయంపై సీనియర్ సైకియాట్రిస్ట్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 'జీవితాలను మార్చేంత శక్తిని కలిగి ఉండటమే స్నేహం గొప్పతనం. అయితే ఫ్రెండ్‌షిప్ కూడా ఎప్పుడూ సజావుగా సాగదు. ఒక్కోసారి అవి కూడా సంక్లిష్టంగా మారవచ్చు. కానీ నిరంతరం అభివృద్ధి చెందుతుండటమే ఫ్రెండ్‌షిప్ బ్యూటీ. ఇక స్నేహితుల సంఖ్యనే కాక వారితో ఎలా ఉండాలన్న విషయంలోనూ ఎటువంటి పరిమితులు లేవు. కాబట్టి మైత్రి బంధం చాలా విలువైనది' అన్నారు.
ప్రతీ ఒక్కరి జీవితంలో ఉండాల్సిన 5 రకాల స్నేహితులు :
* కేరింగ్ పర్సన్ :
కుటుంబంతో పాటు మన సహవాసం కోసం ఎప్పుడూ ఎదురుచూసే మిత్రుడు కూడా ఉండాల్సిందే. నిపుణుల ప్రకారం.. ప్రేమించే, మన పట్ల శ్రద్ధ వహించే స్నేహితుడి అవసరం జీవితంలో తప్పకుండా ఉంటుంది. అంతెందుకు ఎప్పుడూ వెన్నంటి ఉండే అలాంటి ఫ్రెండ్‌ను కలిగి ఉండటం కూడా ప్రతిష్టాత్మకంగా భావించే వీలుంది.
* చెప్తే వినేవాడు :
జీవితంలో సలహా ఇచ్చేందుకే కాకుండా మన మాట వినేవాళ్లుంటే బాగుండన్న సందర్భాలూ తటస్థిస్తాయి. ఆ టైమ్‌లో ఒక్క ఫ్రెండ్ మాత్రమే సాయం చేయగలడు. మనుసులో గూడుకట్టుకున్న అనేక భావాలను పంచుకోవాలన్న ఫీలింగ్ కలిగితే ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లడం ఉత్తమం. కాబట్టి ఎవరైనా మనపై శ్రద్ధ చూపుతున్నారని.. మన ఆలోచనలు, భావాలను వారు కూడా అంగీకరిస్తున్నారని విశ్వసించినప్పుడు, వారి వద్ద పూర్తిగా వ్యక్తీకరించే స్వేచ్ఛ మనకు ఉన్నట్లుగా అనిపిస్తుంది.
* సరదా స్నేహితుడు :
నవ్వించే వారిని అందరూ ఇష్టపడతారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారు మిమ్మల్ని నవ్వించగలరు. ఆయా వ్యక్తులతో ఉంటే అస్సలు బోరింగ్ క్షణాలే ఉండవు. మిమ్మల్ని ఎలా సంతోషపెట్టాలో వారికంటే ఎక్కువ ఇంకెవరికీ తెలిసుండదు. ఎక్కడా విసిగించకుండా, నిరంతరం ప్రోత్సహిస్తూ ప్రతి సిచ్యువేషన్‌లో నవ్వించేందుకు ప్రయత్నిస్తుంటారు. సెన్సాఫ్ హ్యూమర్ కలిగిన ఇలాంటి స్నేహితుని లక్షణాలన్నీ విలువైనవే. అలాంటి మిత్రుడు ఉన్నట్లయితే మీరు నిజంగా అదృష్టవంతులే.
* విధేయుడు :
ఒక స్నేహితుడికి ఉండాల్సిన అత్యంత కీలకమైన లక్షణాల్లో విధేయత ఒకటి. దీనివల్ల ఫ్రెండ్‌షిప్ బలపడుతుంది. నమ్మకం, విశ్వాసం పెరుగుతాయి. విశ్వసనీయ మిత్రుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా ఉంటూ స్థిరమైన స్నేహాన్ని కొనసాగిస్తాడు. అటువంటి వారితో ఉన్నప్పుడు అస్సలు ఒంటరి భావన అనుభవించరు. మీరు విజయం సాధించినప్పుడు నిజంగా సంతోషించే స్నేహితుల్లో వారు ఒకరు. కాబట్టి నమ్మకమైన వ్యక్తిని కనుగొనండి!
* తెలివైనవాడు :
ఇంటెలిజెంట్ ఫ్రెండ్ వెన్నంటే ఉంటే విజయావకాశాలు పెరుగుతాయనేది నిజం. ఎదురుదెబ్బలు తగిలినపుడు తిరిగి నిలబడేందుకు తెలివైన స్నేహితుడే సాయపడగలడు. జీవితంలో సలహా లేదా మార్గదర్శకత్వం అవసరమైన ప్రతీసారి మనం వారినే ఆశ్రయిస్తాం. మొత్తం మీద వివేకవంతుడైన మిత్రుడు అంటే.. నేర్పించగలవాడు, రక్షించగలవాడే కాదు కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కాలం మీకు కట్టుబడి ఉండే వ్యక్తి.