కడిగేసిన కాగ్.. 12 సంస్థలు.. రూ. 85 వేల కోట్ల అప్పు
రాష్ట్రంలోని ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు, మూడు స్వయంప్రతిపత్తి సంస్థలు గడిచిన నాలుగేండ్లలో రూ. 85 వేల కోట్ల అప్పు చేశాయి.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు, మూడు స్వయంప్రతిపత్తి సంస్థలు గడిచిన నాలుగేండ్లలో రూ. 85 వేల కోట్ల అప్పు చేశాయి. వీటిలో రూ. 70 వేల కోట్లకు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల కోసం ఈ అప్పులు చేసినట్లు కాగ్ వెల్లడించింది. అయితే రుణాలు తీసుకుంటామని శాసనసభకు చెప్పుతున్నా వాటికి సంబంధించిన ఖచ్చితమైన అంశాలను మాత్రం వెల్లడించడం లేదని కాగ్ తప్పు పట్టింది.
ఒక్క ఏడాది రూ.16 వేల కోట్లు
బడ్జెట్తో సంబంధం లేకుండా సేకరించిన రుణాలపై కాగ్ వివరాలు సేకరించినట్లు వెల్లడించింది. దీనికి కేవలం 12 సంస్థలు మాత్రమే వివరాలు ఇచ్చాయని, 2020లో ఈ సంస్థలు రూ. 16,077 కోట్ల రుణాలు తీసుకున్నాయని, మొత్తం నాలుగేండ్లలో రూ. 85,380 కోట్లు తీసుకున్నాయని వెల్లడించారు. అయితే వీటికి సంబంధించిన వడ్డీలు, నెలవారీ కిస్తీలను మాత్రం రాష్ట్ర బడ్జెట్ నుంచి చెల్లిస్తున్నట్లు స్పష్టం చేసింది.