ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం బీపీసీఎల్‌తో హీరో మోటోకార్ప్ భాగస్వామ్యం!
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు హీరో మోటోకార్ప్ మంగళవారం ప్రకటించింది. దీంతో భరాత్‌లో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రముఖ ప్రభుత్వ రంగ దిగ్గజం తో జతకలిసిన మొదటి ఆటోమోటివ్ కంపెనీగా తాము నిలిచామని హీరో మోటోకార్ప్ వెల్లడించింది.
ఇప్పటికే బీపీసీఎల్ 7,000 పెట్రోల్ బంకుల్లో ఈవీ ఛార్జింగ్ సదుపాయాలు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈవీ వినియోగదారులకు ఛార్జింగ్ పరిష్కారాలు అందించడంలో ముందున్న బీపీసీఎల్‌తో భాగస్వామయం మరింత ఎక్కువ ప్రయోజనాలను కస్టమర్లకు ఇవ్వడానికి వీలవుతుందని హీరో మోటోకార్ప్ సీఎండీ పవన్ ముంజల్ అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు దేశవ్యాప్తంగా ఎనర్జీ స్టేషన్ నెట్‌వర్క్ పరిధిలో గణనీయమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నాయి.
మొదటి దశలో భాగంగా ప్రధాన తొమ్మిది నగరాల్లొ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ఉంటుందని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరణ జరుగుతుందని ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. ద్విచక్ర వాహన పరిశ్రమలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న హీరో మోటోకార్ప్‌తో భాగస్వామయం ద్వారా ఎనర్జీ స్టెషన్లలో వినియోగదారులకు ఈవీ ఛార్జింగ్ పరిష్కారాలు మరింత వేగవంతం అవనున్నాయని బీపీసీఎల్ సీఎండీ అరుణ్ కుమార్ సింగ్ వెల్లడించారు.