కరోనా మరణాల్లో తెలంగాణ సరికొత్త రికార్డు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మరణ మృదంగం కొనసాగుతోంది. ఎన్నడూ లేని విధంగా గతేడాది భారీ స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. సమాచార హక్కు చట్టం కింద వెలుగులోకి వచ్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో గతేడాది 1,20,929 మంది చనిపోయినట్లు తేలింది. ‘మీ సేవ‘ ద్వారా డెత్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు స్పష్టమైంది. వీటిలో 55,270 మరణాలు కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇంతటి భారీ సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఇదే […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మరణ మృదంగం కొనసాగుతోంది. ఎన్నడూ లేని విధంగా గతేడాది భారీ స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. సమాచార హక్కు చట్టం కింద వెలుగులోకి వచ్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో గతేడాది 1,20,929 మంది చనిపోయినట్లు తేలింది. ‘మీ సేవ‘ ద్వారా డెత్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు స్పష్టమైంది. వీటిలో 55,270 మరణాలు కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇంతటి భారీ సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. గడచిన ఏడేళ్ళుగా సగటున ప్రతీ ఏటా 53 వేల నుంచి 79 వేల మధ్యన నమోదవుతుండగా గతేడాది మాత్రం ఒకేసారి 1.20 లక్షలు దాటింది. ఈ ఏడాది ఏడు నెలల్లోనే 80 వేలు దాటింది.
రాష్ట్రవ్యాప్తంగా చనిపోయినవారి లెక్కలు వెలుగులోకి వచ్చినా.. గతేడాది నుంచి పెరగడానికి కారణం కరోనా వైరస్ కారణమన్న అభిప్రాయాలు వైద్యుల నుంచి వ్యక్తమవుతున్నాయి. కరోనా మృతుల లెక్కల్లో ప్రభుత్వం వాస్తవాలను దాస్తున్నదంటూ విపక్షాలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్న సమయంలో గణాంకాలు వెలుగులోకి రావడం ఆ అనుమానాలకు, విమర్శలకు బలం చేకూర్చినట్లయింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం మరణాల్లో సింహభాగం జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటే ఆ తర్వాతి స్థానాల్లో వరంగల్ అర్బన్, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి.
రాష్ట్రం ఏర్పడిన తర్వత ఏడేళ్ల కాలంలో మొత్తంగా 5.38 లక్షల మరణాలు నమోదయ్యాయి. ఇందులో రెండు లక్షలు కేవలం గతేడాదిలో నమోదైనవే. ఇక కరోనా వైరస్ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాతి పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నట్లయితే గతేడాది మార్చి నెల నుంచి ఈ ఏడాది జులై 26వ తేదీ వరకు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1.80 లక్షల మంది చనిపోయారు. అంతకుముందు జనవరి, ఫిబ్రవరి నెలలను కూడా కలుపుకుంటే అదనంగా మరో ఇరవై వేలు చేరి రెండు లక్షలు దాటింది. కరోనా పరిస్థితులు నెలకొన్న తర్వాత మరణాల సంఖ్య పెరగడం గమనార్హం.
గతేడాది పన్నెండు నెలల కాలంలో నమోదైన మరణాల్లో దాదాపు 70 శాతం ఈ ఏడాది ఏడు నెలల్లోనే నమోదయ్యాయి. ఇందులో దాదాపు సగం (37,739) జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క మే నెలలోనే 21,633 నమోదయ్యాయి. గతేడాది మే నెలలో రాష్ట్రం మొత్తంమీద ఐదు వేలు మాత్రమే నమోదయ్యాయి. మరణాల్లో జీహెచ్ఎంసీ తొలి స్థానంలో ఉంటే ఆ తర్వాతి ప్లేస్‌లలో వరంగల్ అర్బన్ (13,395), నిజామాబాద్ (6,290), ఖమ్మం (6,043), కరీంనగర్ (4,707), రంగారెడ్డి (4,578) జిల్లాలు ఉన్నాయి.
రాష్ట్రంలో నమోదైన మరణాలు (జిల్లాల్లో)
2014 21,837 (జూన్ 2 నుంచి)
2015 36,643
2016 33,390
2017 40,617
2018 41,948
2019 52,903
2020 65,659
2021 42,892
2014 జూన్ 2 నుంచి 2021 జూలై 26 వరకు జీహెచ్ఎంసీలో నమోదైన మరణాలు 2,03,065