బీఎస్పీ పోటీ బీఆర్ఎస్‌కు లాభం.. అనుమానాలకు తావిస్తోన్న RSP తీరు?

రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీఎస్పీ ఒక్క స్థానం కూడా గెలవలేదు. మెజారిటీ స్థానాల్లో డిపాజిట్‌నూ దక్కించుకోలేదు. కానీ, ఈసారి తెలుగు రాష్ట్రాల చరిత్రలో మొదటి సారి ఏకంగా 119 సెగ్మెంట్లలో అభ్యర్థులను నిలబెట్టింది.

Update: 2023-11-24 02:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీఎస్పీ ఒక్క స్థానం కూడా గెలవలేదు. మెజారిటీ స్థానాల్లో డిపాజిట్‌నూ దక్కించుకోలేదు. కానీ, ఈసారి తెలుగు రాష్ట్రాల చరిత్రలో మొదటి సారి ఏకంగా 119 సెగ్మెంట్లలో అభ్యర్థులను నిలబెట్టింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలుస్తూ కాంగ్రెస్ ఓటు బ్యాంకును డ్యామేజ్ చేసి బీఆర్ఎస్‌కు సహకరిస్తున్నదనే సాధారణ అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆర్ఎస్పీ చెప్తున్నదొకటి.. చేస్తున్నది మరొకటి.. అనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సర్వీసు (ఐపీఎస్)ను వదులుకుని (వాలంటరీ రిటైర్‌మెంట్) బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. బడుగు బలహీనవర్గాలు, బహుజనులకు రాజ్యాధికారం కావాలన్న నినాదంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. ఒకవైపు బీఎస్పీ రాజకీయ అస్థిత్వాన్ని నిలబెట్టడం, మరోవైపు పార్టీ ప్రతిష్టను పెంచుకుని తన స్థానాన్ని పదిలం చేసుకోవడం ఆయనకు తక్షణ కర్తవ్యంగా మారాయి. కానీ ప్రస్తుతం బీఎస్పీ తీరు అనేక అనుమానాలకు తావిస్తున్నది.

కాంగ్రెస్‌ను డ్యామేజ్ చేసే వ్యూహం

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పలు పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం ఆ కూటమికి దూరంగానే ఉన్నది. డైరెక్టుగా ఎన్డీఏ కూటమితోనూ బీఎస్పీకి సంబంధాలు లేవు. కానీ పరోక్షంగా బీజేపీకి సహకారం అందిస్తున్నదని పలు బీజేపీయేతర పార్టీలు బీఎస్పీ అధినేత్రి మాయావతిపై విమర్శలు గుప్పించాయి. తెలంగాణలోనూ కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలుస్తూ కాంగ్రెస్ ఓటు బ్యాంకును డ్యామేజ్ చేస్తున్నదని, అంతిమంగా బీఆర్ఎస్‌కు సహకరిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాటల్లో బీఆర్ఎస్‌ను వ్యతిరేకిస్తూ చేతల్లో ప్రయోజనం కలిగిస్తున్నదనేది బహిరంగ రహస్యం.

బీఆర్ఎస్‌కు మేలు

అటు కాంగ్రెస్‌కు, ఇటు బీఆర్ఎస్‌కు సమదూరం పాటిస్తున్నట్టు బీఎస్పీ చెప్పుకుంటున్నా.. ఆ వైఖరి పరోక్షంగా జాతీయ స్థాయిలో కమలం పార్టీకి, రాష్ట్ర స్థాయిలో గులాబీ పార్టీకి మేలు చేస్తున్నదనే విమర్శలను మూటగట్టుకున్నది. యాంటీ-బీఆర్ఎస్ నినాదంతో ఎన్నికల ప్రచారంలోకి దిగిన బీఎస్పీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై ఆధారపడుతున్నది. కాంగ్రెస్, బీజేపీ సైతం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే టార్గెట్‌గా బరిలో నిల్చున్నాయి. బీఎస్పీ పోటీతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఈ పార్టీలన్నీ పంచుకోవడం అనివార్యంగా మారింది. బీఎస్పీకి సంప్రదాయికంగా ఉండే దళిత, బహుజన ఓటు బ్యాంకు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు వ్యక్తిగతంగా ఉండే ఇమేజ్‌తో పడే ఓట్లు చివరకు కాంగ్రెస్‌ పార్టీని డ్యామేజ్ చేయనున్నాయి.

గెలవడానికా?.. గెలిపించడానికా?

గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 106 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిన బీఎస్పీ ఒక్క చోట కూడా గెలవలేదు. 102 చోట్ల డిపాజిట్ సైతం దక్కలేదు. మొత్తంగా 2.3% ఓటింగ్ పర్సంటేజీకి పరిమితమైంది. ఈసారి మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నది. ఇదంతా బీఎస్పీ గెలావడానికా? లేక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి పరోక్షంగా, లోపాయకారీగా బీఆర్ఎస్‌ను గెలిపించడానికా? అనే చర్చకు తావిచ్చినట్లయింది. ఈసారి గెలుపొందే అభ్యర్థికి, ప్రత్యర్థికి మధ్య స్వల్ప మార్జిన్ మాత్రమే ఉంటుందనే అంచనాలు నెలకొన్నందున బీఎస్పీ చీల్చే ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఈ ఓట్లే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నాయనే చర్చలు మొదలయ్యాయి. బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్‌గా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో బీఎస్పీ అన్ని చోట్లా పోటీ చేయడం వివాదాస్పదంగా మారింది. బీఎస్పీ చివరకు ఎన్ని సీట్లు గెలుస్తుంది?.. బీఆర్ఎస్‌ను దెబ్బతీయాలనే ఆ పార్టీ.. తన లక్ష్యానికి విరుద్ధంగా ఎందుకు వ్యవహరిస్తున్నది? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా బీఆర్ఎస్‌కే ప్రయోజనం అనే విషయాన్ని విస్మరించిందా? అనే అంశాలు ప్రస్తుతం కీలకంగా మారాయి.

మెజార్టీ నియోజకవర్గాల్లో ముఖాముఖి పోటీ నెలకొన్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టడానికే బీఎస్పీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నదనే విమర్శలు ఓపెన్‌గానే వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు సర్వే సంస్థలు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తాయో..? ఎన్ని చోట్ల ముఖాముఖిగా టఫ్ ఫైట్ నెలకొన్నదో.. ఒపీనియన్ పోల్ అంచనాల్లో వెల్లడించాయి. కనీసంగా 20-30 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉన్నదని, స్వల్ప మార్జిన్‌తోనే ఏదో ఒక పార్టీ బయటపడే అవకాశమున్నదని అంచనా వేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీఎస్పీ చీల్చే ఓట్లు నిర్ణయాత్మకంగా మారుతున్నాయి. యాంటీ గవర్నమెంట్ స్లోగన్‌ను మరింతగా ప్రచారం చేసి కాంగ్రెస్‌ను గండికొట్టడమే బీఎస్పీ లక్ష్యమని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్న బీఎస్పీ.. రాష్ట్రంలోనూ బీ-టీమ్‌గా ఉన్న బీఆర్ఎస్‌ను గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నదని విమర్శించారు. ఆర్ఎస్పీ తపనంతా కేసీఆర్‌ను గెలిపించడానికేననే అభిప్రాయం వినిపిస్తున్నది.

Read More : ఎన్నికల వేళ BRSకు బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి మరో సిట్టింగ్ MLA

Tags:    

Similar News