చీఫ్‌విప్‌గా మల్ రెడ్డి రంగారెడ్డి..? కాంగ్రెస్ వేసిన భారీ వ్యూహమిదే..!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని ప్రభుత్వం చీఫ్ విప్‌గా నియమించనున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని ప్రభుత్వం చీఫ్ విప్‌గా నియమించనున్నది. నేడో, రేపో అధికారికంగా ఉత్తర్వులు రానున్నట్లు తెలిసింది. చీఫ్‌విప్ గా ఆయనకు వ్యూహాత్మకంగానే పోస్టు ఇవ్వనున్నారు. తొలుత మంత్రి పదవి ఇస్తున్నట్లు ప్రచారం జరిగినా.. వివిధ సమీకరణాల దృష్ట్యా కేబినెట్ ర్యాంక్‌తో కూడిన చీఫ్‌విప్ పదవిని ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తప్పా, మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ ఓటమి పాలయ్యింది.
జిల్లాల్లో కాంగ్రెస్ వేవ్ కనిపించడంతో ఆ పార్టీ పవర్‌లోకి రాగలిగింది. దీంతో ఇప్పుడు గ్రేటర్ పరిధిలో పార్టీ పట్టు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల లోపు క్షేత్రస్థాయి కేడర్‌కు కాంగ్రెస్ జెండాలు కప్పాలని పార్టీ వ్యహాత్మకంగా అడుగులు వేస్తోన్నది. మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్వ్యంలో అన్ని నియోజకవర్గాల్లో చేరికల టీమ్‌లు ఫామ్ అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు తర్వాత మల్ రెడ్డి రంగారెడ్డి తన టాస్క్ ను మొదలు పెట్టనున్నట్లు సమాచారం.
సిటీలో క్రీయాశీలకంగా వర్క్..
మల్‌రెడ్డి రంగారెడ్డి 1981లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1981లో తోరూర్ సర్పంచ్‌గా గెలిచాడు. ఆ తర్వాత 1986లో హైదరాబాద్ డీసీబీబి డైరెక్టర్‌గా పని చేశారు. ఇక 1994లో మలక్ పేట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందగా, 2023 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని కీలకమైన లీడర్లందరితోనూ రంగారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే అభిప్రాయంలో పార్టీ ఉన్నది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ బలోపేతం బాధ్యతలు ఆయనకు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.
టీడీపీ కేడర్‌కు గాలం....
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంబర్ పేట్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ ,ముషీరాబాద్, సనత్ నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, మల్కాజ్ గిరి, మేడ్చల్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ బలంగా విశ్వసిస్తున్నది. కానీ ఈ ఎన్నికల్లో ఆయా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులు ఎమ్మెల్యేలు గెలవడంతో కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహాం అమలుకు సిద్ధం కానున్నది. లీడర్ల కంటే గ్రౌండ్ లెవల్ కేడర్‌ను క్లీయర్ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఈ మేరకు అధికారంలోని కాంగ్రెస్ తన దైన శైలీలో స్ట్రాటజీలను అమలు చేయనున్నది.