కవిత నెంబర్ తప్పక వస్తుంది.. అప్పుడు జైలుకు వెళ్లాల్సిందే: కేంద్ర మంత్రి
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం గోషామహాల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం గోషామహాల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ‘ప్రస్తుతం దేశంలో వరల్డ్ కప్ జరుగుతోంది. ఇందులో మన టీం అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. అలాగే.. తెలంగాణ ఎన్నికల సందర్భంగా బ్యాట్స్‌మెన్‌గా పార్టీ జాతీయ నాయకత్వం నన్ను పంపింది’ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎంతో దోచుకుందని విమర్శించారు. రాజస్థాన్ సచివాలయంలో కోట్లు, కిలోల కొద్దీ బంగారం దొరికిందని గుర్తుచేశారు.
విదేశాల నుంచి డబ్బులను ఎన్నికల కోసం తెప్పిస్తోంది.. వచ్చే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. మహాదేవ్ యాప్ పేరిట కాంగ్రెస్ అవకతవకలకు పాల్పడుతోంది. మహాదేవ్ యాప్ పేరుతో దేవుడి పేరును చెడగొట్టారు. మహాదేవ్ యాప్ పేరిట 508 కోట్లు ఛతీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్‌కు అందాయని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ గ్యారెంటీలు వర్కవుట్ అవ్వడం లేదని.. అబద్ధపు కాంగ్రెస్.. అబద్ధపు గ్యారెంటీలని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్ల ఎంతోమంది మరణించారని అన్నారు. పార్లమెంట్‌లో సోనియా, కాంగ్రెస్ నేతలు ఎలా వ్యవహరించారో నాకు తెలుసని చెప్పారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ మంచి చేస్తారని అనుకుంటే ఆయన కూడా నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు.
పదేళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్.. జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచిందని తీవ్రంగా సెటైర్లు వేశారు. తెలంగాణలో ఎంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడని సీరియస్ కామెంట్స్ చేశారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరి నంబర్ వస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా జైలుకు పోవాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజినీరింగ్ బ్లండర్ అని ఎద్దేవా చేశారు.