Tummala Nageswara Rao : సీఎం కేసీఆర్‌కు తుమ్మల బిగ్ షాక్?

బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతోంది.

Update: 2023-08-22 11:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. పలువురు ఆశావహులకు మొదటి విడతలో నిరాశే దక్కడంతో వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాలేరు టికెట్ ఆశించిన కేసీఆర్ సన్నిహితుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన బీఆర్ఎస్‌కు గుడ్ బై చెబుతారని ప్రచారం జరుగుతున్నది. దీనికి తోడు ఆయన అనుచరులంతా ఇవాళ పాలేరులో రహస్యంగా సమావేశమయ్యారు. పార్టీలో సీనియర్ నేత తుమ్మలను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన కందాళకు తిరిగి టికెట్ ఇవ్వడంపై మండిపడుతున్నారు. దీంతో తుమ్మల అనుచరులు సమావేశమై భవిష్యత్ కార్యచరణపై సమాలోచనలు జరుపుతున్నారు. తుమ్మల ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న నేపథ్యంలో సమావేశం అనంతరం అనుచరులంతా హైదరాబాద్‌కు వెళ్లి తుమ్మలను కలిసేందుకు వస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ ఆఫర్?

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న తుమ్మలకు కాంగ్రెస్ నుండి ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో ఈ సారి గెలిచి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావించిన తుమ్మల కొద్ది రోజుల క్రితమే తన పోటీ విషయమై క్లారిటీ ఇచ్చారు. తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు కేసీఆర్ షాకివ్వడంతో పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్ పై తుమ్మల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తుమ్మల డెసిషన్ ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News