Ponguleti Srinivas Reddy : హాజరు కానున్న అగ్ర నేతలు.. పొంగులేటి చేరిక సభకు పేరు ఫిక్స్!

పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఖమ్మంలో జూలై 2వ తేదీన భారీ బహిరంగసభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Update: 2023-06-28 07:06 GMT

దిశ బ్యూరో, ఖమ్మం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఖమ్మంలో జూలై 2వ తేదీన భారీ బహిరంగసభ ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. ఈ సభకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి.. ఎస్‌ఆర్ గార్డెన్స్ పక్కన గల 100 ఎకరాల స్థలంలో జరగనున్న ఈ భారీ బహిరంగ సభకు ‘జనగర్జన’ నామకరణం చేశారు. ఈ సభ కోసం ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు. సమయం తక్కువగా ఉండడంతో పనులన్నీ ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. 2వ తేదీన జరిగే ఈ సభకు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు, రాష్ట్రానికి చెందిన అందరు ముఖ్యనేతలు హాజరు కానున్నారు. 5లక్షలకు పైగా జనం ఈ సభకు తరలిరావచ్చనే అంచనాలు ఉన్నాయి. భారీ బహిరంగ సభకు వచ్చే వాహనాల సభా ప్రాంగణం చుట్టు పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.


హాజరు కానున్న రాహుల్ గాంధీ, అగ్రనేతలు..

2వ తేదీన ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ ‘జన గర్జన’కు అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఆయనతో పాటు రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావు ఠాక్రే సహా ఇతర ముఖ్యనేతలు కూడా రానున్నారు. రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలందరూ హాజరు కానున్నారు. ఇప్పటికే సీనియర్ నాయకులు సభ ఏర్పాట్లు, సక్సెస్ చేసేందుకు దృష్టిపెట్టారు. ఈ సభలోనే పాంగులేటి శ్రీనివాసరెడ్డి సహా ఆయన టీం సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

100 ఎకరాల్లో సభ..

‘జన గర్జన’ సభకు 5లక్షలకు పైగా జనం వస్తారని అంచనా వేస్తున్నారు. సభ కోసం 100ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా సభకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం నాలుగుచోట్ల 50 ఎకరాల చొప్పున స్థలం కేటాయించారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు, పొంగులేటి అభిమానులు ఈ సభకు తరలిరానున్నారు. ఈ మేరకు ఇప్పటికే వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మంలో మాత్రం సభ కోసం ఎలాంటి వాహనాలు అందుబాటులో లేకుండా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. సొంత వాహనాలు ఏర్పాటు చేసుకుని సభకు వచ్చేలా కాంగ్రెస్ శ్రేణులు అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

రేపు ఖమ్మంకు రేవంత్ రెడ్డి..

జూలై 2న ఖమ్మంలో జరిగే సభకు ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. అయితే సభకు నిర్వహణ, ఏర్పాట్లు, తదితర అంశాలపై సూచనలు చేయడానికి రేపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖమ్మం రానున్నట్లు తెలుస్తోంది. ‘జనగర్జన’ సభకు జన సమీకరణ, పాటించాల్సిన వ్యూహాలు, ఇబ్బందులు ఎదురవకుండా తీసుకోవాల్సిన చర్యలు, సభ ఏర్పాట్లు, పార్కింగ్ లాంటి విషయాలపై రేవంత్ చర్చించనున్నారు.

సభ రద్దు ప్రచారం అవాస్తవం..

జూలై 2వ తేదీన కాంగ్రెస్ సభ రద్దయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సభ రద్దు కాలేదని నిర్వహకులు చెబుతున్నారు. ఇప్పటికే సభకు సంబంధించి పనులు త్వరత్వరగా పూర్తి చేస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సభ కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు, పొంగులేటి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి సభ సక్సెస్ చేయాలని పొంగులేటి టీం కోరుతోంది..

ఏర్పాట్లు జరుగుతున్నాయి..


ఖమ్మం సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాటు మొదలయ్యాయి. సమయం తక్కువగా ఉన్నందున వేగంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎలాగైనా సభను సక్సెస్ చేస్తాం.. సభకు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా అన్ని జిల్లాల నుంచి సైతం కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కొందరు సభకు వాహనాలు ఇవ్వకుండా చేస్తున్నారని చెబుతున్నారు.. సొంత వాహనాలతోనే పొంగులేటి అభిమానులు సభకు భారీ తరలివస్తారు.

-పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి సోదరుడు

Tags:    

Similar News