తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు తేదీ ఖారారు..! ఆ రోజే అనౌన్స్‌మెంట్

తెలంగాణలో ఇప్పటికే ఎన్నిల వేడి మొదలైంది.

Update: 2023-10-06 10:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇప్పటికే ఎన్నిల వేడి మొదలైంది. పార్టీలన్నీ గెలుపు కోసం ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అభ్యర్థులను ఖరారు చేసుకోవడంతో పాటు ప్రచారాన్ని మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడెప్పుడా వస్తుందా? అని పార్టీలతో పాటు ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే ఈసీ ఏర్పాటు మొదలుపెట్టడం, తుది జాబితా విడుదల చేయడంతో ఏ క్షణమైనా షెడ్యూల్ రానుందని తెలుస్తోంది.

అక్టోబర్ 8 నుంచి 10వ తేదీల మధ్య తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానుందని సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత కొద్దిరోజులకు నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ తొలివారంలో పోలింగ్ నిర్వహించనున్నారని, 10 నుంచి 15వ తేదీల మధ్య కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారని నేషనల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు నిర్వహించేందుకు సీఈసీ ఏర్పాట్లు చేస్తోన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలకు కూడా ఒకేసారి షెడ్యూల్ విడుదల చేయనున్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ ఉండనుంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో సీఈసీ అధికారులు పర్యటించి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఇటీవల తెలంగాణలో మూడు రోజుల పాటు ఈసీ బృందం పర్యటించింది. ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర అధికారులు, డీజీపీ, సీఎస్‌తో భేటీ నిర్వహించారు. ఈ పర్యటన సందర్భంగా తుది ఓటర్ల జాబితాను కూడా విడుదల చేశారు.

శుక్రవారం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఎన్నికల పరిశీలకలతో సీఈసీ సమావేశం నిర్వహిస్తుంది. షెడ్యూల్ విడుదల, పోలింగ్‌కు ఏర్పాట్లు, తదితర విషయాలపై చర్చించనున్నారు. ఈసీ వరుస భేటీలతో ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలోనైనా విడుదల కానుందని తెలుస్తోంది. షెడ్యూల్ విడుదల తర్వాత రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.

Tags:    

Similar News