సర్కార్ చేసిన ద్రోహాన్ని గుర్తు తెచ్చుకోండి.. ఈసారి కేసీఆర్‌ను గద్దె దింపాల్సిందే!
ఆర్టీసీ కార్మికులు గడచిన పదేండ్ల కేసీఆర్ పాలనలో చవిచూసిన చేదు అనుభవాలను, కోల్పోయిన సమ్మె హక్కునూ, అనుభవించిన కష్టాలను గుర్తుకు తెచ్చుకుని ఈసారి బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలంగాణ పీపుల్స్ జేఏసీ పిలుపునిచ్చింది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మికులు గడచిన పదేండ్ల కేసీఆర్ పాలనలో చవిచూసిన చేదు అనుభవాలను, కోల్పోయిన సమ్మె హక్కునూ, అనుభవించిన కష్టాలను గుర్తుకు తెచ్చుకుని ఈసారి బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలంగాణ పీపుల్స్ జేఏసీ పిలుపునిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఉనికిలోకి వచ్చిన పీఆర్సీ బకాలను ఇప్పటికీ కేసీఆర్ సర్కార్ చెల్లించలేదని, ఆ తర్వాత 2017, 2021 పీఆర్సీ బకాయిలను సైతం ఎగ్గొట్టిందని జేఏసీ గుర్తుచేసింది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తే సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తామని బెదిరించడంతో పాటు ఇకపైన సమ్మె చేయబోమంటూ హామీ తీసుకున్నదని పేర్కొన్నది. కార్మిక సంఘాలను రద్దు చేసి కార్మికుల గొంతు నొక్కిన సర్కార్‌ను ఓడించాలని విజ్ఞప్తి చేసింది.
ప్రజాస్వామ్యంలో సమ్మెచేసే హక్కు ఉన్నప్పటికీ కేసీఆర్ పాలనలో మాత్రం అది నిషేధిత పదంగా మారిందని, ఇకపైన ఇలాంటి హక్కుల్ని పొందాలంటే బీఆర్ఎస్‌ను ఓడించక తప్పదని పిలుపునిచ్చింది. సొంత బస్సుల్ని కొనుగోలు చేయకుండా అద్దె బస్సులను నడిపిస్తూ కార్మికుల సంఖ్యను 54 వేల నుంచి 43 వేలకు తగ్గించిన కేసీఆర్ ప్రభుత్వం ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయలేదని గుర్తుచేసింది. సర్వీసు నుంచి రిటైర్ అయిన కార్మికులు, చనిపోయిన సిబ్బంది, వీఆర్ఎస్ తీసుకున్న స్టాఫ్‌కు ఇప్పటికీ సెటిల్‌మెంట్ సొమ్మును చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిందని, సమ్మె సమయంలో 35 మంది కార్మికులు చనిపోయినా కనికరించకపోగా బెదిరింపులకు పాల్పడిందని పేర్కొన్నది.
తొమ్మిదేండ్లుగా జీతభత్యాల కోసం ఆర్టీసీ కార్మికులు పోరాడుతూ ఉంటే మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మభ్యపెట్టి వాగ్ధానాలు ఇచ్చి మోసం చేసిన బీఆర్ఎస్ సర్కారు ద్రోహాన్ని ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలని కోరింది. ఆర్టీసీ భూములపై కన్నేసిన కేసీఆర్ ప్రభుత్వం సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు విధాన నిర్ణయం తీసుకుని గవర్నర్ దగ్గర ఆమోదం కోసం బిల్లు పెండింగ్‌లో ఉన్నదంటూ నమ్మబలికి క్లియరెన్స్ వచ్చిన తర్వాత పట్టించుకోలేదని పేర్కొన్నది. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు అటు సంస్థకు చెందినవారో లేక ప్రభుత్వానికి చెందినవారో తెలియని కన్‌ప్యూజన్ ఉన్నదని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 5% ఐఆర్ (మధ్యంతర భృతి) విషయంలో ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదని, వారి జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటున్నదని, దీన్ని గ్రహించి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించాలని తెలంగాణ పీపుల్స్ జేఏసీ విజ్ఞప్తి చేసింది.
Read More : 35 నియోజకవర్గాల్లో ఆ ఓటు బ్యాంకే కీలకం.. ఆకర్షించేందుకు బీఆర్ఎస్ పాట్లు