కేసీఆర్‌పై కేసు వ్యవహారం.. ఇవాళే నిర్ణయం

మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ అయిన వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్‌ భూపాలపల్లి ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో అడ్మిట్ అయింది.

Update: 2023-11-24 03:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ అయిన వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్‌ భూపాలపల్లి ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో అడ్మిట్ అయింది. పిటిషనర్ రాజలింగమూర్తి తరఫున అడ్వొకేట్ సంజీవరెడ్డి వాదిస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు పరిధిలోకి వచ్చే పిటిషన్ కాదని, ఎన్నికల అంశంతో సంబంధం లేనందువల్ల ఆ కోర్టు విచారణ పరిధిలోకి రాదని పేర్కొన్నారు. బ్యారేజ్ డ్యామేజ్ విషయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా దాన్ని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ క్లోజ్ చేశారని ఆ పిటిషన్‌లో రాజలింగమూర్తి పేర్కొన్నారు. కానీ డ్యామేజీకి ఎవరు బాధ్యులో పేర్కొనేలా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఫిర్యాదు చేసినా ఇప్పటికీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ స్పందించలేదని, వెంటనే నమోదు చేయాల్సిందిగా ఆదేశించాలని తన పిటిషన్‌లో మూర్తి కోరారు.

ఇప్పటివరకు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించని కోర్టు.. గురువారం విచారణకు స్వీకరిస్తున్నట్లు పేర్కొని అడ్మిట్ చేసకుని నంబర్ ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్నందున హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టుకు తరలించాలన్న అభిప్రాయంతో పిటిషనర్ తరఫు న్యాయవాది విభేదించారు. క్రిమినల్ కేసుకు సంబంధించిన ఫిర్యాదులు అందిన తర్వాత ఆరు రోజుల వ్యవధిలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు గతంలో (నెం. 68, 2008)లో పేర్కొన్నదని, కానీ రాజలింగమూర్తి భూపాలపల్లి స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసి దాదాపు నెల రోజులు అవుతున్నా నమోదు కాలేదని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది లేవనెత్తిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నది. బ్యారేజీ డ్యామేజ్ విషయంలో సీఎం కేసీఆర్ సహా అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, చీఫ్ ఇంజనీర్ హరిరామ్ తదితర మొత్తం 8 మందిని పిటిషనర్ నిందితులుగా పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Read More : 35 నియోజకవర్గాల్లో ఆ ఓటు బ్యాంకే కీలకం.. ఆకర్షించేందుకు బీఆర్ఎస్ పాట్లు

Tags:    

Similar News