రేపటి రంగంలోకి అన్ని పార్టీల నేతలు.. స్టేట్‌లో పెరగనున్న పొలిటికల్ హీట్!
ఆషాఢ మాసం ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అని రాజకీయ నేతలు ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆ వెయిటింగ్ కంప్లీట్ అవుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఆషాఢ మాసం ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అని రాజకీయ నేతలు ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆ వెయిటింగ్ కంప్లీట్ అవుతున్నది. శ్రావణం సెంటిమెంట్‌తో బుధవారం నుంచి ప్లానింగ్ మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. సరికొత్త పొలిటికల్ వ్యూహాలతో రంగంలోకి దిగాలనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో మంచి ముహూర్తం చూసుకుని కార్యక్షేత్రంలోకి దూకాలనుకుంటున్నారు. ఇప్పటికే మాటలతో పొలిటికల్ పార్టీల మధ్య యుద్దం జరుగుతున్నది. ఇక ఫీల్డ్ మీదకు వెళ్ళడానికి ఆయా పార్టీల నేతలు స్కెచ్ వేసుకుంటున్నారు. ఎన్నికలకు ఐదు నెలలే మిగిలి ఉన్నందున మూడు పార్టీలూ ముమ్మర వ్యూహాల్లో బిజీ అయిపోయాయి.
వివిధ పార్టీల్లోని పలువురు నేతలు వేర్వేరు కారణాలతో మరోదాంట్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. సంప్రదింపుల ప్రక్రియ ముగిసినా మంచి రోజుల కోసం వెయిట్ చేశారు. ఆషాఢం నెగెటివ్ సెంటిమెంట్‌తో నిర్ణయం తీసుకోలేకపోయారు. రెండు రోజుల్లో ఆషాఢం ముగుస్తుండడంతో పూజారులతో మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుని వలస వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఈ సంవత్సరం రెగ్యులర్‌గా వచ్చే శ్రావణ మాసానికి ముందే ‘అధిక శ్రావణం’ వస్తున్నది. ఈ మాసంలో మంచి ముహూర్తాలు ఉంటాయో లేవో తేల్చుకుని జంప్ కావడంపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు టికెట్ సంగతి తేలినా తేలకున్నా క్షేత్రస్థాయిలో ప్రచారానికి సైతం మంచి రోజును ఎంచుకోవాలనుకుంటున్నారు మరికొద్దిమంది నేతలు.
ఇదిలా ఉండగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం పలు జిల్లాల్లోని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు అక్కడి పార్టీ ఆఫీసులనూ ఓపెన్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 24న సూర్యాపేట టూర్ పెట్టుకున్నారు. ఇంకోవైపు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ పర్యటించే ప్రోగ్రామ్ ప్రాథమికంగా రూపొందింది. తేదీలను ఖరారు చేయడమే మిగిలింది. రాష్ట్రంలోనూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి షెడ్యూలు రూపొందించే పనులు జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లా నుంచి మొదలుపెట్టడం ఆనవాయితీ. ఈసారి ఎక్కడి నుంచి ప్రచారానికి శ్రీకారం చుడతారనేది ఆసక్తికరంగా మారింది. చాలా నియోజకవర్గాల్లోని సిట్టింగ్‌లు, ఆశావహులు కేసీఆర్ పాల్గొనేలా బహిరంగ సభలపై ఫోకస్ పెట్టారు.
ఆషాఢం ముగిసిపోతుండడంతో ఏ తీరులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలనే చర్చల్లో బీఆర్ఎస్ నేతలు బిజీ అయిపోయారు. ప్రచారంలో వాడే వాహనాన్ని సిద్ధం చేసుకోవడంతో పాటు ప్రస్తావించాల్సిన అంశాలు, విపక్షాలపై విరుచుకుపడడం, కొత్తగా ఇవ్వాల్సిన హామీలు, ఇప్పటివరకు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల చిట్టా.. తదితరాలతో సిద్ధమవుతున్నారు. వారి ఇష్టదైవంగా ఉండే ఆలయాన్ని సందర్శించి ప్రచారంలోకి దూకాలని భావిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకే టికెట్లు దక్కుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అలాంటి కాన్ఫిడెన్సు ఉన్న నేతలంతా నియోజకవర్గాల్లో ప్రచారంపై దృష్టి పెట్టనున్నారు. అనుమానం ఉన్న నేతలు ఏం చేస్తారన్నది సస్పెన్స్ గా తయారైంది.
బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టుపై ఉత్కంఠ :
ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థుల్ని ప్రకటిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో పేర్కొన్నారు. ఆషాఢ మాసం కావడంతో లిస్టు రాకపోవచ్చని చాలా మంది సిట్టింగ్‌లు వారికివారు సర్దిచెప్పుకున్నారు. ఎవరికి టికెట్ వస్తుందో రాదోననే ఉత్కంఠ పలువురిని ఇంతకాలం కలవరపెట్టింది. ఇప్పుడు ఆషాఢ మాసం ముగుస్తుండడంతో ఈ నెల 18 తర్వాత ఎప్పుడైనా ఫస్ట్ లిస్టు రిలీజ్ అయ్యే అవకాశముందని నమ్మకాలు పెట్టుకున్నారు. సుమారు 70 మంది క్యాండిడేట్స్ పేర్లతో మొదటి జాబితాను తెలంగాణ భవన్‌లో కేసీఆర్ రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కచ్చితంగా గెలుస్తారనే భరోసా ఉన్నవారి జాబితాను ఫస్ట్ లిస్టు పేరుతో ప్రకటించే అవకాశాలున్నాయి.
బీఆర్ఎస్ లిస్టు విడుదలైన తర్వాతనే అభ్యర్థులపై ఒక స్పష్టతకు రావాలని కాంగ్రెస్ ఎదురుచూస్తున్నది. టికెట్ ఆశించినా జాబితాలో పేర్లు లేని నేతలు తమవైపు వస్తారనే ఆశతో ఉన్నది. గత ఎన్నికల తరహాలో చివరి నిమిషం వరకూ లిస్టును పెండింగ్‌లో పెట్టకుండా ముందుగానే ప్రకటిస్తామని కాంగ్రెస్ సీనియర్లు పలువురు ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో సెప్టెంబరు 17న సోనియాగాంధీ చేతుల మీదుగా మేనిఫెస్టోను రిలీజ్ చేయించి ఆ తర్వాత అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం. బీజేపీ సైతం ఇతర పార్టీల నుంచి అసంతృప్తి వాదులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూనే సొంత పార్టీ నుంచి ఎవ్వరూ చేజారిపోకుండా డిఫెన్స్ వ్యూహాన్నీ రూపొందించుకున్నది.
ఇవి కూడా చదవండి: