TS: నేటి నుంచే నామినేషన్లు.. అభ్యర్థుల వెంట ఆ కాపీ కూడా తప్పనిసరి!
కేంద్ర ఎలక్షన్ కమిషన్ గత నెల 9న విడుదల చేసిన షెడ్యూలుకు అనుగుణంగా ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడదల కానున్నది. వెంటనే నామినేషన్లను దాఖలు చేసే ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది.
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఎలక్షన్ కమిషన్ గత నెల 9న విడుదల చేసిన షెడ్యూలుకు అనుగుణంగా ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడదల కానున్నది. వెంటనే నామినేషన్లను దాఖలు చేసే ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ప్రతీ రోజు ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి కార్యాలయం (ఆర్డీవో ఆఫీస్)లో దాఖలు చేయవచ్చనని, సెలవు దినాల్లో కుదరదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం స్పష్టం చేసింది. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులు 100 మీటర్ల దూరం నుంచి మూడు వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఉంటుందని, ఆర్వో గదిలోకి అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
ఆన్‌లైన్ విధానం (సువిధ పోర్టల్) ద్వారా కూడా నామినేషన్లను దాఖలు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఫిజికల్ కాపీని కూడా రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని సీఈఓ ఆఫీస్ పేర్కొన్నది. నామినేషన్‌తో పాటు ఆస్తులు, ఆదాయం వివరాలను తెలిపే అఫిడవిట్, ఇప్పటివరకు అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చును లెక్కించడానికి వీలుగా ప్రతీ అభ్యర్థి విడిగా బ్యాంకు ఖాతాను కూడా ఓపెన్ చేయడం తప్పనిసరి. అఫిడవిట్‌లను అప్పటికప్పుడే ఆర్వో ఆఫీస్‌లోని డిస్‌ప్లే బోర్డులో ప్రదర్శించడంతో పాటు 24 గంటల వ్యవధిలో సీఈఓ వెబ్‌సైట్ పోర్టల్‌లో కూడా అప్‌లోడ్ చేయాలన్నది ఈసీ విధించిన నిబంధన.
ఎలక్షన్ అబ్జర్వర్స్ నియామకం :
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ టీమ్ రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి సీఈఓ, అడిషనల్ సీఈఓ, జాయింట్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, సీఎస్, డీజీపీ, అడిషన్ డీజీపీ తదితర ఉన్నతాధికారులంతో సమీక్ష నిర్వహించింది. ఏర్పాట్లలో తలెత్తిన లోపాలను సరిదిద్దుకోవడంపై పలు సూచనలు చేసింది. ఎన్నికల నిర్వహణలో కీలక భూమిక పోషించే ఎలక్షన్ అబ్జర్వర్ల నియామక ప్రక్రియను సైతం ఈసీ చేపట్టింది. ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నం కాగా ఇతర రాష్ట్రాల నుంచి 67 మందిని అబ్జర్వర్లుగా నియమిస్తున్నది. నామినేషన్ల ప్రాసెస్ ప్రారంభం కావడంతోనే వీరు రంగంలోకి దిగనున్నారు.
మరోవైపు అభ్యర్థుల ఎన్నికల ఖర్చును పరిశీలించడానికి, విశ్లేషించడానికి ఐఆర్ఎస్, ఐఆర్ఏఎస్, ఐఏఏఎస్ అధికారులను కూడా 60 మందిని ఈసీ రంగంలోకి దించుతున్నది. ఐఏఎస్ అధికారులంతా సాధారణ పరిశీలకులుగా ఎలక్షన్స్ కి సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తారు. వ్యయ పరిశీలకులు మాత్రం అభ్యర్థుల రోజువారీ ఖర్చుకు సంబంధించిన అంశాలపై మాత్రమే ఫోకస్ పెడతారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతోనే డ్యూటీని మొదలుపెట్టనున్నారు. వీరికి తోడు శాంతిభద్రతల విషయంలో పర్యవేక్షణ కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన 39 మంది ఐపీఎస్ అధికారులు కూడా వస్తున్నారు. నామినేషన్లు పూర్తికాగానే ఈ నెల 10 నుంచి వీరు రంగంలోకి దిగనున్నారు. రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాల మధ్య సమన్వయంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం లేకుండా చూడడంలో వీరు కీలక భూమిక పోషించనున్నారు.
నోటిఫికేషన్ విడుదల : నవంబరు 03
నామినేషన్ల దాఖలు ప్రారంభం : నవంబరు 03
చివరి తేదీ : నవంబరు 10
పరిశీలన : నవంబరు 13
ఉపసంహరణ గడువు : నవంబరు 15
పోలింగ్ తేదీ : నవంబరు 30