తెలంగాణ బీజేపీ అసెంబ్లీ వ్యూహం.. టార్గెట్ ఎన్ని స్థానాలో తెలుసా?

అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండడంతో యాక్టివిటీస్‌ను ముమ్మరం చేయాలని బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నది. దక్షిణ భారత ఎన్డీఏ భాగస్వాములతో ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో జరిగిన భేటీ తర్వాత రాష్ట్ర బీజేపీ ఎంపీలు, నేతలతో అమిత్ షా విడిగా సమావేశమయ్యారు.

Update: 2023-08-03 02:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండడంతో యాక్టివిటీస్‌ను ముమ్మరం చేయాలని బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నది. దక్షిణ భారత ఎన్డీఏ భాగస్వాములతో ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో జరిగిన భేటీ తర్వాత రాష్ట్ర బీజేపీ ఎంపీలు, నేతలతో అమిత్ షా విడిగా సమావేశమయ్యారు. తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. టార్గెట్-75 పేరుతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న సీనియర్ నేతలంతా విధిగా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని స్పష్టం చేశారు. దీంతో ప్రాథమికంగా 25-30 మంది అభ్యర్థులు ఏయే స్థానాల్లో పోటీ చేయాలనేది దాదాపుగా ఖరారైంది. రాష్ట్రంలోని 119 స్థానాల్లో కనీసంగా 75 గెలిచేలా టార్గెట్-75 టాస్క్ ను నిర్దేశించింది. నిర్దిష్టంగా ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది త్వరలోనే కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం అందుతుందని వీరికి అమిత్ షా సూచించినట్లు తెలిసింది. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తున్నందున సీనియర్ నేతలంతా పోటీ చేయడం తప్పదని, అందుకు మానసికంగా సిద్ధం కావాలని నొక్కిచెప్పారు. ఢిల్లీకి రావడాన్ని తగ్గించి ఎక్కువ రోజులు గల్లీలోనే ప్రజల మధ్య ఉండాలని సూచించారు. పార్టీ ఇప్పటివరకూ అనుసరిస్తున్న ట్రెడిషనల్ విధానాలకు భిన్నంగా ప్రజలకు చేరువయ్యేందుకు స్థానికంగా వినూత్న రీతిలో ఆలోచించి రాష్ట్ర యూనిట్ నాయకత్వంలో సమిష్టి కృషితో నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పించింది.

వివాదాల జోలికి వెళ్ళొద్దు :

వ్యక్తిగత భేదాభిప్రాయాలను పక్కన పెట్టి టీమ్ స్పిరిట్‌తో పనిచేయాల్సిందిగా హై కమాండ్ సూచించింది. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించడంతో పాటు పార్టీ లైన్ తప్పితే వేటు తప్పదని హెచ్చరించింది. ఇటీవల పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని ఈ వార్నింగ్ ఇచ్చింది. పార్టీలో ఉంటూనే లైన్‌కు భిన్నంగా కామెంట్లు చేయడం ద్వారా శ్రేణుల్లో కన్‌ప్యూజన్ వస్తుందని, ఇతర పార్టీల్లోకీ వెళ్ళిపోతున్నారని, కేడర్ డీమోరల్ అవుతుందని గుర్తించింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇక నుంచి పార్టీలో లూజ్ టాక్‌లపై సీరియస్‌గా వ్యవహరించాలనుకుంటున్నది.

సమ ఉజ్జీగా నిలబడేందుకు తపన :

బీఆర్ఎస్‌తో దోస్తీగా ఉన్నదంటూ ఇటీవల వచ్చిన ఆరోపణలు పార్టీని బాగా డామేజ్ చేసినట్లు హై కమాండ్ గుర్తించింది. బీఆర్ఎస్‌తో ఎలాంటి రిలేషన్ లేదనే నమ్మకం ఏర్పడాలంటే దానికి తగిన కార్యాచరణ ఉండాలని స్టేట్ యూనిట్‌కు అర్థం చేయించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వం సహకారం అందించినా దాన్ని వాడుకోలేని అసమర్ధతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళే కార్యాచరణను ఎంచుకోవడంపై స్పష్టత ఇచ్చింది. కర్ణాటక ఎన్నికల రిజల్టు వరకు దూకుడు మీద ఉన్న బీజేపీ క్రమంగా ఇనాక్టివ్ కావడంతో శ్రేణుల్లో నిరుత్సాహం ఏర్పడిందని, ఇక నుంచి రెగ్యులర్‌గా సీరియస్ యాక్టివిటీస్‌పై దృష్టి పెట్టాలని సూచించింది. ముక్కోణపు పోటీ ఉండడం ద్వారానే ప్రధాన రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోగలమనే ధైర్యాన్ని నూరిపోసింది.

అభ్యర్థుల్ని ఇంకా ఖరారు చేయలేదు :

హైకమాండ్ఏ స్థానం నుంచి ఏ అభ్యర్థి పోటీ చేయనున్నదానిపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ఏ స్థానం నుంచి ఎవరు బరిలో ఉంటారనేది త్వరలో నిర్ణయం జరుగుతుందని పేర్కొన్నది. ఇదే విషయమై కిషన్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదని, అందువల్ల తాను అంబర్‌పేట్ నుంచి పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పటికీ అఫీషియల్ కాదని వివరణ ఇచ్చారు.

ఢిల్లీలో వార్ రూమ్ నుంచే కంట్రోల్ :

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల స్ట్రాటెజీ మొదలు యాక్టివిటీస్ వరకు మొత్తం ఢిల్లీలోని సెంట్రల్ ఆఫీస్ కనుసన్నల్లోనే జరగనున్నది. ప్రత్యేకంగా వార్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకూ విడివిడిగా ఈ వార్ రూమ్ నుంచి పర్యవేక్షణ కొనసాగనున్నది. ప్రచారం క్యాంపెయిన్ మొత్తాన్ని వార్ రూమ్ నియంత్రిస్తూ ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా టీమ్‌ తయారైంది. రాష్ట్ర నేతలతో కోఆర్డినేషన్ కోసం కూడా స్పెషల్ మెకానిజం రూపొంతోంది.

ప్రతి సెగ్మెంట్‌కూ ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు :

బీజేపీ ఇంతకాలం పార్లమెంటరీ ప్రవాస్ యోజన పేరుతో రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాల పరిధిలో కేంద్ర మంత్రులు పర్యటనలు చేశారు. ఇకపైన అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మొత్తం 119 సెగ్మెంట్లలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు పర్యటించేలా బీజేపీ హై కమాండ్ రోడ్ మ్యాప్‌ను రూపొందించింది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణలోని సెగ్మెంట్లలో తిరుగుతారని, వారం రోజుల పాటు వారు అక్కడే మకాం వేస్తారని సెంట్రల్ ఆఫీస్ వర్గాలు తెలిపాయి. ఈ నెలలోనే ఇది కార్యరూపం దాలుస్తుందని పేర్కొన్నాయి. ఈ వారం రోజుల టూర్‌లో అనుకూల, ప్రతికూల పరిస్థితులను అధ్యయనం చేసి హైకమాండ్‌కు నివేదిక రూపంలో ఆ ఎమ్మెల్యేలు తెలియజేస్తారు.

Tags:    

Similar News