ఆ రెండింటిని అంతం చేసేందుకే పోటీ చేయబోతున్నా: Teenmar Mallanna
తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు మంత్రి మల్లారెడ్డి, మరో వైపు పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు సంబంధించిన యూనివర్సిటీలు పేదలను పట్టి పీడిస్తున్నాయని తీన్మార్ మల్లన్న విమర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు మంత్రి మల్లారెడ్డి, మరో వైపు పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు సంబంధించిన యూనివర్సిటీలు పేదలను పట్టి పీడిస్తున్నాయని తీన్మార్ మల్లన్న విమర్శించారు. ఈ రెండు యూనివర్సిటీలు రాష్ట్రంలోని పేదల రక్తం తాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ రెండు యూనివర్సిటీలను ఖతం చేసేందుకే వచ్చే ఎన్నికల్లో తాను మేడ్చల్ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నానని స్పష్టం చేశారు. మంగళవారం మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటించిన మల్లన్న.. పలు పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు గడిచిన ఏడు నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు.
ఈ రాష్ట్రంలో కేసీఆర్ మనువడు ఏ బియ్యం తింటాడో పేద పిల్లవాడు అదే బియ్యం తింటున్నాడని సర్కార్ గొప్పలు చెప్పుకుంటోందని కానీ వాస్తవానికి ఇక్కడున్న పాఠశాలలో నెల రోజులుగా విద్యార్థులకు కోడిగుడ్డు ఇవ్వడం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సిగ్గులేని ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణ రాజ్యాన్ని ఏలుతుందని ధ్వజమెత్తారు.