కారు లేదు, సెంటు భూమి లేదు.. కేసీఆర్ అఫిడవిట్‌లో సంచలన విషయాలు

రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడైనా కేసీఆర్‌కు సొంతంగా కారు కూడా లేదు. వ్యవసాయమే వృత్తిగా ఉన్నప్పటికీ ఆయన పేరు మీద సెంటు సాగు భూమి కూడా లేదు. ఉన్న భూములన్నీ కుటుంబ ఉమ్మడి ఆస్తులుగానే ఉన్నాయి.

Update: 2023-11-09 10:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడైనా కేసీఆర్‌కు సొంతంగా కారు కూడా లేదు. వ్యవసాయమే వృత్తిగా ఉన్నప్పటికీ ఆయన పేరు మీద సెంటు సాగు భూమి కూడా లేదు. ఉన్న భూములన్నీ కుటుంబ ఉమ్మడి ఆస్తులుగానే ఉన్నాయి. గడచిన ఐదేండ్లలో బ్యాంకు డిపాజిట్లు డబుల్ అయ్యాయి. గత ఎన్నికల (2018 డిసెంబరు) సమయానికి బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ కలిపి రూ. 5.63 కోట్లు ఉంటే ఇప్పుడు అది రూ. 11.16 కోట్లకు పెరిగింది. భార్య శోభ చేతిలో సుమారు రూ.94 వేల మేరకే ఉంటే ఇప్పుడు అది దాదాపు రూ. 6.29 కోట్లకు పెరిగింది. బంగారు ఆభరణాలు మాత్రం 2.8 కిలోలు ఉన్నట్లు తాజాగా సమర్పించిన అఫిడవిట్‌లో కేసీఆర్ పేర్కొన్నారు.

నేనూ రైతునే.. పెద కాపునే.. వ్యవసాయమే చేస్తున్నా.. అని చెప్తున్న కేసీఆర్ తన పేరుమీద సొంతంగా ఒక్క అంగుళం కూడా సాగుభూమి లేదు. అంతా కుటుంబ ఉమ్మడి ఆస్తిగానే ఉన్నది. నాలుగు నెలల క్రితం (జూలైలో) పది ఎకరాల సాగుభూమిని మర్కూక్ మండలంలోని శివారు వెంకటాపురం గ్రామంలో కొన్నారు. దీని విలువ సుమారు రూ. 28.47 లక్షలుగా పేర్కొన్నారు. స్థిర, చరాస్తుల రూపంలో కేసీఆర్‌కు రూ. 17.83 కోట్లు, 9.67 కోట్ల చొప్పున ఉంటే ఆయన భార్య పేరు మీద 7.78 కోట్ల (చరాస్తులు మాత్రమే) మేరకే ఉన్నాయి. ఉమ్మడి ఆస్తిగా రూ. 9.81 కోట్ల మేర చరాస్తులు ఉన్నాయి. ఇక అప్పుల విషయం చూస్తే కేసీఆర్ పేరు మీద రూ. 17.27 కోట్లు, కుటుంబం పేరు మీద రూ. 7.23 కోట్ల మేర ఉన్నాయి.

సొంతంగా కారు, బైక్ లేకపోయినా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీ తదితర 14 వాహనాలున్నాయి. వీటి విలువ రూ. 1.16 కోట్లుగా తేలింది. మొత్తంగా కేసీఆర్ కుటుంబానికి 53.30 ఎకరాల సాగుభూములు, 9.36 ఎకరాల మేర వ్యవసాయేతర భూములున్నాయి.

Tags:    

Similar News