ఆడపిల్లలకు భారీ శుభవార్త.. మేనిఫెస్టోలో కాంగ్రెస్ సంచలన స్కీమ్

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి పేరుతో ఆడపిల్లల పెండ్లికి లక్ష నూట పదహారు రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ ఉంటే దీనికి దీటుగా కాంగ్రెస్ కొత్త హామీని ఇవ్వాలనుకుంటున్నది.

Update: 2023-10-06 11:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి పేరుతో ఆడపిల్లల పెండ్లికి లక్ష నూట పదహారు రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ ఉంటే దీనికి దీటుగా కాంగ్రెస్ కొత్త హామీని ఇవ్వాలనుకుంటున్నది. పెళ్ళి చేసుకునే యువతికి తులం బంగారాన్ని ఇవ్వాలని ఆలోచిస్తున్నది. మహిళా డిక్లరేషన్‌ను ఎలాగూ త్వరలో ప్రియాంకాగాంధీ విడుదల చేయనున్నారు. అందులోనే ఈ హామీని ప్రకటించి చివరకు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ హామీగా పొందుపర్చాలని భావిస్తున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఈ ప్రతిపాదనను మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీధర్‌బాబుకు వివరించారు. పెళ్ళి చేసుకునే యువతికి ఆర్థిక సాయంతో పాటు పసుపు కుంకుమ కింద తులం బంగారాన్ని ఇస్తే మహిళలకు ఎప్పటికీ ఆస్తిగా ఉండిపోతుందన్నది జీవన్‌రెడ్డి అభిప్రాయం. ఈ ప్రతిపాదనకు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సైతం సానుకూలంగా స్పందించి మేనిఫెస్టోలో పొందుపర్చడంపై సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.


ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం తులం బంగారం విలువ సుమారు రూ. 60 వేలకు వరకూ ఉన్నది. రానున్న కాలంలో బంగారం ధర మరింత పెరిగానా దాన్ని రూపాయలతో ముడిపెట్టకుండా బంగారం రూపంలోనే పసుపు కుంకుమగా అందించడం ద్వారా యువతులకు ప్రయోజనం కలుగుతుంది. కల్యాణలక్ష్మి ద్వారా ఇప్పుడు అందుకుంటున్న రూ. లక్షా 116 తో పాటు ఈ తులం బంగారం అదనంగా ఇవ్వాలని నిర్ణయించారు. మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపర్చిన తర్వాత ఏఐసీసీ ఆమోదం తెలిపి ఫైనల్ చేయనున్నది.

Tags:    

Similar News