అలా జరగకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. Uttam Kumar Reddy సంచలన వ్యాఖ్యలు

‘‘హుజుర్​నగర్, కోదాడ నియోజకవర్గాలలో 50 వేల మెజార్టీతో గెలవబోతున్నాం. ఇది జరగకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాం” అంటూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-08-30 14:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘హుజుర్​నగర్, కోదాడ నియోజకవర్గాలలో 50 వేల మెజార్టీతో గెలవబోతున్నాం. ఇది జరగకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాం” అంటూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2018 కంటే బీఆర్ఎస్‌కు ఈసారి ఎక్కువ వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ‌‌కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అహంకారం వలనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందన్నారు. దళితబంధు స్కీమ్‌లో 30 శాతం కమీషన్లు తీసుకోవడం విచిత్రంగా ఉన్నదన్నారు. కేసీఆర్ సర్కార్‌లో కరప్షన్ తారా స్థాయికి చేరిందని, తన రాజకీయ జీవిత చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. కోదాడ, హుజుర్​నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో వర్క్ చేస్తుందన్నారు. నిజామాబాద్‌లో 4, నల్లగొండ జిల్లాలో 12కు 11 సీట్లు పక్కా గెలుస్తున్నామన్నారు. ప్రజల్లో పార్టీపై నమ్మకం పెరిగిందని, అధికారం రావడానికి ఇదే ఇండికేషన్ అన్నారు. అభ్యర్థులు లేని చోట కూడా కాంగ్రెస్‌కు ఓటింగ్ పెరిగిందన్నారు. దేశ వ్యాప్తంగా రాజకీయాలు కలుషితం అయ్యాయని అన్నారు.

మాట నిలపెట్టుకున్నాం..

కర్ణాటక‌లో గృహలక్ష్మి పథకం ప్రారంభమైందన్నారు. కోటి మంది మహిళలకు నెలకు 2 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారంటీ స్కీమ్‌లలో 4 పూర్తయ్యాయని చెప్పారు. కర్ణాటకలో 200 విద్యుత్ యూనిట్లు నిరుపేదలకు ఇస్తున్నామన్నారు. మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అందిస్తున్నామన్నారు. అన్న భాగ్య స్కీమ్ నెలకు 5 కిలోల బియ్యం లేదంటే రూ.170 రూపాయలు ప్రతి మనిషికి చెల్లిస్తున్నామన్నారు. వచ్చే నెల నుండి యువనిది స్కీమ్ అమలు చేస్తామన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో గెలిచిన వెంటనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేశామన్నారు. తెలంగాణలో కూడా ఉద్యోగుల డిమాండ్ మేరకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక కిలో బియ్యం బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఇస్తుంటే మిగతా 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్రూమ్, 3 లక్షల ఆర్థిక సాయం, కేజీ టూ పీజీ వంటి హామీలు అమలు కాలేదన్నారు.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఏమైందని? ప్రశ్నించారు. దళిత, గిరిజనులకు 3 ఎకరాలు అమలు చేయలేదన్నారు. ఉచిత ఎరువులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నదన్నారు. కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందన్నారు. తాను హుజుర్ నగర్ నుంచి పోటీచేస్తున్నానని, తన వైఫ్​కోదాడ నుంచి పోటీ ఉంటుందన్నారు. టిక్కెట్ల పంపిణీ వేగంగా జరిగితే పార్టీకి మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Tags:    

Similar News