బీజేపీ అసమ్మతి నేతలు సీక్రెట్ మీటింగ్.. మీడియాకు లీక్ అవ్వకుండా ప్లాన్..!

రాష్ట్ర నాయకుల తీరు నచ్చక అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుందామన్న బీజేపీ నేతల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ తమకు తగినంత ప్రయారిటీ ఇవ్వడంలేదని పలువురు నేతలంతా ఇటీవల భేటీ అయ్యారు.

Update: 2023-09-25 03:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర నాయకుల తీరు నచ్చక అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుందామన్న బీజేపీ నేతల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ తమకు తగినంత ప్రయారిటీ ఇవ్వడంలేదని పలువురు నేతలంతా ఇటీవల భేటీ అయ్యారు. అమీ తుమీ తేల్చుకోవాలనుకున్నారు. కాషాయ పార్టీ హైకమాండ్ ఎదుటకు వెళ్లి తమ సమస్యలు చెప్పి పరిష్కరించుకోవడమో? పార్టీ మారడమో చేయాలని భావించారు. కానీ ఇప్పుడు వారిలో వారికే ఏకాభిప్రాయం కుదరక సతమతమవుతున్నారు. దీంతో సీక్రెట్ భేటీ జరిగినా.. మీడియాకు లీక్ అవ్వొద్దనే కారణంగా సైలెంట్‌గా ఉండిపోయారు. మొన్న భేటీ జరిగిందని మీడియాకు లీకులిచ్చిన వారే, తాజా భేటీ అనంతరం నేతల మధ్య భిన్నాభిప్రాయాల కారణంగా మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌ను ఢీకొట్టాలని..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పలువురు నేతలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వారు పార్టీ మారే సమయంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉండటంతో కమలం గూటికి చేరారు. తీరా కర్ణాటక ఎన్నికల అనంతరం సీన్ రివర్స్ కావడంతో నాలుక్కరుచుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ రాజకీయ సమీకరణాలు పూర్తిగా తలకిందులయ్యాయి. దీనికి తోడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం మార్పు, కొత్తగా చేరిన కొందరికి ప్రాధాన్యత పెరగడం, కవిత కేసు అంశంపై ఎలాంటి స్పష్టత రాకపోవడం, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేననే చర్చ ప్రజల్లోకి వెళ్లడంతో వలస వచ్చిన నేతలు పలువురు సందిగ్ధంలో పడ్డారు.

ఓ ఫామ్ హౌజ్‌లో సీక్రెట్ మీటింగ్

హైదరాబాద్ శివారు గండిపేటలోని ఓ ఫాంహౌజ్‌లో ఆదివారం బీజేపీ అసమ్మతి నేతలు సీక్రెట్ మీటింగ్ నిర్వహించినట్లు తెలిసింది. పలువురు మాజీ‌ ఎంపీలు సైతం హాజరైనట్లు సమాచారం. కాగా ఇటీవల భేటీ అయిన పది మందిలో ఒకరిద్దరు నేతలు గైర్హాజరైనట్లు తెలిసింది. హాజరైన వారు బీజేపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ నాయకత్వం సీరియస్ గా లేదని పలువురు సీనియర్లు ఆవేదన చెందినట్లు తెలిసింది. రాష్ట్ర బీజేపీలో కీలక పదవిలో ఉన్నవారు కొందరు ఏకపక్షంగా వ్యహరిస్తున్నారని సీనియర్లు అభిప్రాయపడ్డారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేకపోవడంపై చర్చించినట్లు తెలిసింది. రేపో, మాపో ఢిల్లీ వెళ్లి హైకమాండ్ ను కలవాలని‌ వారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సీక్రెట్ మీటింగ్ పై పలువురు నేతలను సంప్రదించగా, తాము ఎలాంటి మీటింగ్ నిర్వహించలేదని చెప్పడం గమనార్హం. నేతల నుంచి నవ్వు మాత్రమే సమాధానంగా వచ్చింది. ఒక వేళ బీజేపీలోనే కొనసాగితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే అలా చెప్పి ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

ఆశించిన డెసిషన్ రాకపోతే..

బీజేపీ హైకమాండ్ నుంచి తమకు ఆశాజనకంగా నిర్ణయం రాకుంటే ఏం చేద్దామనే అంశంపైనా ఈ మీటింగ్ లో చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ మారాలని కొందరు చెప్పగా.. దీన్ని ఒకరిద్దరు వ్యతిరేకించినట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ ఇప్పటికిప్పుడు పార్టీ మారితే తమకు పార్టీలో టికెట్ దక్కుతుందా? లేదా? అనే లెక్కలు సైతం వేసుకున్నట్లు తెలిసింది. చివరి క్షణంలో టికెట్ దక్కకుంటే ఏంటనే చర్చ సైతం జరిగినట్లు టాక్. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనేది చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కాషాయ పార్టీ వీడి హస్తం గూటికి వెళ్దామనుకున్న వారిలో కొద్ది మందికే.. కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇంకొందరికి రెడ్ సిగ్నల్ వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అంతమందికి చోటు కల్పించడం అసాధ్యంగా మారడంతోనే హస్తం పార్టీ వారికి రెడ్ సిగ్నల్ వేసినట్లు సమాచారం. ఈ అంశమే నేతల మధ్య భిన్నాభిప్రాయానికి కారణంగా తెలుస్తోంది. ఒకే మాటపై ఉంటేనే తామనుకున్నది చెల్లుతుందని వారు భావిస్తున్నారు. అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు రేపో మాపో ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలకు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించనున్నారు. ఆ తర్వాతే పార్టీ మారడమా? లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

Read More 2023 Telangana Legislative Assembly election Political News

Tags:    

Similar News