బిల్లా రంగాలు చిత్తకార్తె కుక్కలు.. కేటీఆర్, హరీశ్ రావుపై రేవంత్‌ ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ గెలుపు ఖాయం.. బీఆర్ఎస్ ఓటమి అంతకంటే ఖాయం అని కామెంట్ చేసిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై నిప్పులు చెరిగారు. ఓడిపోతున్నామన్న భయంతో వారిద్దరూ రాష్ట్రమంతా చక్కర్లు కొడుతున్నారని, ఓడిపోతామన్న భయం పట్టుకున్నదన్నారు.

Update: 2023-10-06 09:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ గెలుపు ఖాయం.. బీఆర్ఎస్ ఓటమి అంతకంటే ఖాయం అని కామెంట్ చేసిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై నిప్పులు చెరిగారు. ఓడిపోతున్నామన్న భయంతో వారిద్దరూ రాష్ట్రమంతా చక్కర్లు కొడుతున్నారని, ఓడిపోతామన్న భయం పట్టుకున్నదన్నారు. బిల్లా రంగాలుగా తయారైన వారిద్దరూ చిత్తకార్తె కుక్కల్లా ఊరుమీద పడి తిరుగుతున్నారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మీద అవాకులు చెవాకులు పేలుతున్న హరీశ్‌రావును తొలుత మంత్రిని చేసింది ఆ పార్టీయేనని రేవంత్ గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలను మరుగుజ్జులంటా కామెంట్ చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీయే లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు.

ఉద్యమం సమయంలో డబ్బులు పోగేసుకున్న కల్వకుంట్ల ఫ్యామిలీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయలను దోచుకున్నదని రేవంత్ ఆరోపించారు. ధరణి పోర్టల్‌తో సుమారు పది వేల ఎకరాలను కబ్జా చేశారని అన్నారు. రబ్బరు చెప్పులు వేసుకున్న హరీశ్‌రావుకు ఇప్పుడు ఇంత ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు వారి ముఖాన్ని ఓసారి అద్దంలో చూసుకోవాలంటూ సెటైర్ వేశారు. జాతీయ స్థాయిలో పార్టీ వ్యవహారాల్లో వంశీచందర్ రెడ్డి యాక్టివ్ రోల్ పోషిస్తున్నారని, స్థానికంగా అందుబాటులో ఉండడం కష్టమనే భావంతో పోటీ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నారని రేవంత్ గుర్తుచేశారు. పోటీ చేయాలన్న కోరికను సైతం పార్టీ కోసం త్యాగం చేశారని, ఆయనను రాష్ట్ర పార్టీ నేతలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతున్నదని, సోనియాగాంధీ ప్రకటించిన సిక్స్ గ్యారంటీస్ కర్ణాటక తరహాలో తు.చ. తప్పక అమలవుతాయని, ప్రజలు ఆ విశ్వాసంతోనే ఉన్నారని అన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ రేవంత్ పై వ్యాఖ్యలు చేశారు.

మరుగుజ్జులెవరో, ప్రజల మనుషులు ఎవరో 45 రోజుల్లో తేలుతుందన్నారు. ఓడిపోవడం తప్పదని తెలిసే ఇతర దేశాల పాస్‌పోర్టులు రెడీ చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దగ్గర అధికారం, పదవులు లేవని, అయినా కసిరెడ్డి, మైనంపల్లి, రేఖా నాయక్ లాంటివారంతా పదవుల్లో ఉంటూనే తమ దగ్గరకు వచ్చారని గుర్తుచేశారు. బీఆరెస్ ప్రాధాన్యత అంతా ఎన్నికలు, ఓట్లు సీట్లు మాత్రమేనని, కానీ కాంగ్రెస్ ప్రాధాన్యత మాత్రం ప్రజల సంక్షేమమని అన్నారు. బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో ఉంటే, బీఆర్ఎస్ స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసే ఉన్నాయనేది ప్రజలకు అర్థమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళ మధ్య అవగాహన కుదిరిందన్నారు.

Tags:    

Similar News