భయపడే ముచ్చటే లేదు.. ఐటీ దాడులపై రేవంత్ రెడ్డి రియాక్షన్
‘ఐడీ దాడులకు అదరం.. బీజేపీ బెదిరింపులకు భయపడం” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఐటీ రైడ్‌లు జరుగుతున్నాయన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘ఐడీ దాడులకు అదరం.. బీజేపీ బెదిరింపులకు భయపడం” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఐటీ రైడ్‌లు జరుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలకు పాల్పడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లు ఐటీ సంస్థలకు కనిపించడం లేదా? అంటూ విమర్శించారు. కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతు కావడం ఖాయమని నొక్కి చెప్పారు. తమ ప్రభుత్వంలోనే ముస్లీంలకు న్యాయం జరుగుతుందన్నారు. మోడీ, కేసీఆర్‌లకు బీ టీమ్‌గా ఎంఐఎం మారిందన్నారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుందన్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయన్నారు. గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో మాత్రమే ఐడీ దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని రేవంత్ పిలుపునిచ్చారు.
ముస్లింలకు న్యాయం :
కాంగ్రెస్ పార్టీతోనే ముస్లింలకు న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన మైనార్టీ డిక్లరేషన్ ప్రకటన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ తరహాలోనే మైనార్టీ డిక్లరేషన్‌ను రిలీజ్ చేశామన్నారు. కాంగ్రెస్ పవర్‌లో ఉన్న సమయంలోనే ఎంతో మంది ముస్లింలు మంత్రులు, రాజ్యసభ సభ్యులుగా పనిచేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మాదిరిగా మైనార్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి రూ.4 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. వక్ఫ్ భూములను కాపాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలసి పనిచేస్తున్నాయన్నారు. జూబ్లీహిల్స్ టికెట్‌ను అజహరుద్దీన్‌కు కేటాయిస్తే ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టడం విచిత్రంగా ఉన్నదన్నారు. కామారెడ్డిలో షబ్బీర్ ఆలీకి కాకుండా ఎంఐఎం కేసీఆర్‌కు మద్దతు ఇస్తోందన్నారు. కానీ రాజా సింగ్‌పై మాత్రం ఎంఐఎం పోటీ చేయడం లేదన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌ను పవర్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ మోస్తే గుర్తింపు...
జెండా మోసిన వారికి కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా గుర్తింపు లభిస్తుందని రేవంత్ గుర్తుచేశారు. సికింద్రాబాద్ ప్రచారంలో పాల్గొన్న రేవంత్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు నష్టం జరగకుండా కాపాడుకుంటామన్నారు. పార్టీ కోసం మొదట్నుంచి పనిచేస్తున్న ఆదం సంతోష్, ముషీరాబాద్‌లో అంజన్ కుమార్ యాదవ్‌కు, నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందన్నారు. కంటోన్మెంట్‌లో తన గళంతో ప్రజలను చైతన్యం చేసిన గద్దరన్న బిడ్డకు టికెట్ ఇచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకున్నారని హరీష్ మాట్లాడుతున్నారని, ఆ చరిత్ర బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. కోకాపేట భూములు అమ్ముకున్నది? ఎవరు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు సాయం పథకాలను వెంటనే అమలు చేస్తామన్నారు.
Read More..
కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు.. IT దాడులపై పొంగులేటి కామెంట్స్