ఆ గుంటనక్కల నుంచి ప్రమాదం పొంచి ఉంది.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలను కల్వకుంట్ల కుటుంబం పట్టిపీడిస్తోందని, రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించబోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజలను కల్వకుంట్ల కుటుంబం పట్టిపీడిస్తోందని, రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించబోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణను బీఆర్ఎస్ వంచించిందని అన్నారు. కేసీఆర్ కుటుంబం అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు చూసే సీఎం కేసీఆర్‌కు చలి జ్వరం వచ్చిందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ఇక విశాంత్రి తీసుకునే సమయం వచ్చిందన్నారు. తెలంగాణ ప్రకటనతో 2009 డిసెంబర్ 9 నాడు ఒక అద్భుతం జరిగింది.. రాబోయే డిసెంబర్‌లో తెలంగాణలో మారో అద్భుతం జరగబోతుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హాయంలో జరిగిన దోపిడీని ప్రజల ముందు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో ఓట్లను చీల్చేందుకు గుంట నక్కలు పొంచి ఉన్నాయని అన్నారు.