ఆయన గురించి తప్పుగా మాట్లాడితే ప్రజలే చెప్పుతో కొడతారు: రేవంత్
కేసీఆర్ ధనదాహానికి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరానికి కర్త, కర్మ, క్రియ అన్ని తానే అని చెప్పిన కేసీఆర్ ఇవాళ బ్యారేజ్ కుంగిపోగానే ఆ తప్పును సాంకేతిక నిపుణుల మీదకు తోసి సమస్యను చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ ధనదాహానికి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరానికి కర్త, కర్మ, క్రియ అన్ని తానే అని చెప్పిన కేసీఆర్ ఇవాళ బ్యారేజ్ కుంగిపోగానే ఆ తప్పును సాంకేతిక నిపుణుల మీదకు తోసి సమస్యను చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని ధ్వజమెత్తారు. అవినీతి వాసననే తనకు పడదని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీ కాళేశ్వరం అవినీతి కంపును ఎలా భరిస్తున్నారని ప్రశ్నించారు.
ఈ అవినీతి కంపు మోడీకి దరిచేరకుండా కేసీఆర్ ఏదైనా సెంట్ కొట్టి వశీకరణ చేస్తున్నాడా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర బృందం ఇచ్చిన నివేదికపై సీబీఐ విచారణకి కేంద్రం ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు కాళేశ్వరం సందర్శనకు వెళ్లి మేడిగడ్డకు వెళ్లి పరిశీలించాలన్నారు. బండి సంజయ్ ని అధ్యక్షుడిగా తొలగించిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని, బీజేపీ అధికారంలోకి రాదు కాళేశ్వరంపై విచారణ చేయదన్నారు.
ఇది కేసీఆర్ ప్రణాళిక బద్దమైన ఆర్థిక నేరం:
అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఆలోచనలు మారాయని ఆశలు పెరిగాయని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పేరు మార్చి కాళేశ్వరంగా మార్చారని దుయ్యబట్టారు. ఇందుకోసం ప్రాజెక్టుల రీడిజైనింగ్ అనే పదాన్ని కేసీఆర్ ఉపయోగించుకున్నారన్నారు. కాళేశ్వరం కోసం తన మెదడు కరగదీశానని చెప్పిన కేసీఆర్ మేడిగడ్డ, అన్నారం ఇలా ప్రాజెక్టుల్లో ఇన్ని లోపాలు బయటపడుతుంటే కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. ఎల్ అండ్ టీ కంపెనీపై చర్యలకు కేసీఆర్ ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు అడిగే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వకపోతే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. 80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని కేటీఆర్ మాట్లాడుతున్నారని పార్లమెంట్ లో కాళేశ్వరం అంచనా 2021లో 86 వేల కోట్లు అని కేంద్రం చెప్పిందన్నారు. కమషన్లు నొక్కడానికే కేసీఆర్ ప్రణాళిక బద్దంగా ఆర్థిక నేరానికి పాల్పడ్డారని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్ లు వేరు నిర్మాణం వేరు జరిగాయని విమర్శించారు. కేసీఆర్ పాపం పండిందని అందుకే బ్యారేజీలు కుంగుతున్నాయని దుయ్యబట్టారు.
అలా మాట్లాడితే చెప్పుతో ప్రజలే కొడతారు:
తెలంగాణ ద్రోహులంతా ఏకమవుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై రేవంత్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కోదండరాం గురించి, ఆయన చిత్తశుద్ధి గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఆయనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ సమాజం చెప్పుతో కొడతారంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.