రాష్ట్రంలో 80 సీట్లు పక్కా గెలుస్తాం: Revanth Reddy

కాంగ్రెస్‌తోనే పాలమూరు జిల్లాకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన గద్వాల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ నేతలను పార్టీలోకి ఆహ్వానించారు.

Update: 2023-08-29 14:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌తోనే పాలమూరు జిల్లాకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన గద్వాల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినా పాలమూరు గోస తీరలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ హయంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినవే అని తెలిపారు. కాంగ్రెస్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14కు 14 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్నారు.

చేవెళ్ల దళిత-గిరిజన డిక్లరేషన్ అమలు చేసి ఆయా వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు, పైలేరియా డయాలిసిస్ పేషంట్లకు నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మరోసారి హామీనిచ్చారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంతోపాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల సాయం అందిస్తామన్నారు.

Tags:    

Similar News