50 రోజులు కష్ట పడండి.. నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి పిలుపు
కేసీఆర్ ఉద్యోగం ఊడకొడితేనే.. నిరుద్యోగులకు జాబ్స్ వస్తాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ యువత కేవలం 50 రోజులు సమయం కేటాయించి, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ప్రజలకు వివరించాలని, అప్పుడు తప్పకుండా మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ ఉద్యోగం ఊడకొడితేనే.. నిరుద్యోగులకు జాబ్స్ వస్తాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ యువత కేవలం 50 రోజులు సమయం కేటాయించి, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ప్రజలకు వివరించాలని, అప్పుడు తప్పకుండా మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. లక్షలాది మంది ఆశలపై బీఆర్ఎస్ నీళ్లు జల్లిందన్నారు. “మిస్సింగ్ కిడ్” అంటూ మంత్రి కేటీఆర్ తన కుమారుడు హిమాన్షు ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.
‘‘దూరంగా ఉన్న బిడ్డ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతోందా కేటీఆర్.. కొడుకుతో కొద్ది రోజల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతోంది కదా.. ఉద్యోగం కోసం ఏండ్ల తరబడి ఇంటి మొఖం చూడని, లక్షలాది మంది నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన నీలా కాదనుకున్నావా? సర్కారు హాస్టళ్లలో మీరు పెట్టే తిండి తినలేకఏడుస్తున్నారని తెలిసి అమ్మా నాన్నలు పడే ఆవేదన నీలా కాదనుకున్నావా?కొడుకు తిరిగిరాక, పదేళ్లుగా ఏ సాయానికి నోచుకోక... కుమిలి కుమిలి ఏడుస్తున్న అమరవీరుడి కుటుంబ యాతన నీలా కాదనుకున్నావా?మీ గ్లోబరీనా కంపెనీ ఉసురు తీసిన30 మంది ఇంటర్ విద్యార్థుల కన్నపేగుల ఆక్రందన.. నీలా కాదనుకున్నావా?తిండిపెట్టక చిన్నారులని ఏడిపించి, ఫీజు బకాయిలివ్వక యువతని గోసపెట్టి...ఉద్యోగాలివ్వక నిరుద్యోగులని వంచించిన మీ సర్కారుకు తల్లిదండ్రుల శాపం తగిలి తీరుతుంది..” అంటూ రేవంత్ రెడ్డి రీ ట్వీట్ చేశారు.