మేము వస్తున్నాం.. కుల గణన చేస్తాం : రాహుల్ గాంధీ
తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన ప్రోగ్రాం చేపడుతామని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
దిశ, కాటారం: తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన ప్రోగ్రాం చేపడుతామని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లిజ జిల్లా కాటారం కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. దేశంలో కులాల వారిగా గణాంకాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని, అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రధాని మోడీ కోటరీలో ఉన్న వారిలో 5 శాతం మంది కూడా ఓబీసీ అధికారులు లేరని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కుల గణన చేపట్టేందుకు సుముఖంగా లేదని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా కులగణన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇదే పద్ధతిన తెలంగాణాలో కూడా అధికారంలోకి రాగానే అవలంభిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.
దేశంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగడం లేదని బ్యూరోకాట్ల కనుసన్నల్లోనే పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. 92 మంది బ్యూరో క్రాట్లలో ఐదు శాతం మంది మాత్రమే ఓబీసీ అధికారులు ఉండడం దారుణమన్నారు. దేశంలో బీజేపీపై తానొక్కడినే ఒంటరి పోరాటం చేస్తున్నాని, తనపై కేసులు నమోదు చేశారని పార్లమెంటు సభ్యత్వం రద్దుచేసి ఇల్లు కూడా లేకుండా చేశారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తాను భయపడేది లేదని, నిస్సంకోచంగా పోరాటం చేస్తానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాటారం సెంటర్‌కు వచ్చిన ప్రజల అభిమానం, సంతోషం చూస్తుంటే కేసీఆర్ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించి తీరుతుందన్న దీమా వచ్చిందన్నారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. తెలంగాణలో దొరల పాలనకు స్వస్తి చెప్పి ప్రజా తెలంగాణగా ఏర్పడాల్సి ఉందన్నారు. ఈ ఎన్నికలు ఓ రాజుకు ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటమని ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకుండా పదేళ్లుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడి సమస్యలు అక్కడ వదిలేశారని మండిపడ్డారు. ప్రజలకు దూరంగా ఉంటూ ప్రజాభీష్టం మేరకు పాలన చేపట్టకుండా రాష్ట్రంలో కుటుంబ పాలన చేసేందుకే ప్రాధాన్యత ఇచ్చారంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలోని అధికారం పూర్తిగా కుటుంబానికే పరిమితమే ఫ్యామిలీ కేంద్రీకృతంగానే తెలంగాణా పరిపాలన సాగుతోందన్నారు.
తెలంగాణలోనే అవినీతి అధికం..
రాష్ట్రంలో అవినీతి అక్రమాలపై కూడా ప్రస్తావించిన రాహుల్ గాంధీ దేశంలోనే తెలంగాణాలో అతి ఎక్కువ అవినీతి జరుగుతోందని ధ్వజమెత్తారు. ఈ అవినీతి సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో గెలుపు కోసం ఉపయోగిస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ, ఇన్ కం ట్యాక్స్ వంటి శాఖలను బూచిగా చూపిస్తూ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. తెలంగాణాలో అవినీతికి పాల్పడుతున్న సీఎం కేసీఆర్ పై కేంద్ర ప్రభుత్వం ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఎంఐఎం, బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థులను నిలబెడుతూ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు.
ప్రేమతో కూడిన అనుబంధం
తెలంగాణ ప్రజలతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఉన్న అనుబంధం రాజకీయంతో కూడుకున్నది కాదని, ప్రేమతో కూడిన అనబంధమేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ కుటుంబానికి, సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలతో ఉన్నది ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఆశీర్వాదాలతో కూడుకున్న అనుబంధం ఉందన్నారు. బీజేపీతో రాజకీయ అనుబంధం మాత్రమే తెలంగాణ ప్రజలకు ఉందని, కానీ కాంగ్రెస్, తెలంగాణ మధ్య నెలకొన్న ప్రేమ, అనుబంధం ఏనాటికీ విడిపోనిదన్నారు. ఈ కారణంగానే రామప్పకు నా చెల్లెలు ప్రియాంక గాంధీని తీసుకొచ్చానన్నారు. తెలంగాణ అంశంలో ప్రజా సేవకుడిగా పని చేస్తానన్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు థాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ములుగు, మంథని ఎమ్మెల్యేలు సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.