అందుకే వాళ్లు పార్టీకి దూరమయ్యారు.. పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు
సొంత పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో బీసీలకు టికెట్లు ఇచ్చామంటే సరిపోతుందా అని ప్రశ్నించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సొంత పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో బీసీలకు టికెట్లు ఇచ్చామంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. పార్టీలో ఆ వర్గం వారికి సముచిత ప్రాధాన్యత కల్పించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలు దూరం అయ్యారని అందువల్లే 1983 తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంగం స్థానాలు కూడా గెలవలేకపోయిందని వ్యాఖ్యానించారు. దీనిపై లోతుగా పరిశీలన చేయాలన్నారు. 2014లో ఎన్నికలకు 40 రోజుల ముందు తనను పీసీసీగా చేశారని తక్కువ సమయంలో అనేక ఎన్నికలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అదే సమయంలో తెలంగాణ తెచ్చింది అని నేనే అని చెప్పకుండా సీఎం కేసీఆర్ తెలివిగా రాజకీయం చేశారన్నారు.
తెలంగాణ తెచ్చింది నేనే అని చెబితే సోనియా గాంధీ ఇచ్చింది అని ప్రజల్లో ఆలోచన వస్తుందనే కేసీఆర్ వ్యూహాత్మకంగా దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అనే హామీతో రాజకీయం చేశారన్నారు. కాగా, గత కొంత కాలంగా బీసీలకు తగిన సీట్లు ఇవ్వాలని పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేస్తున్నారు. అలాగే పార్టీలో సీనియర్లకు గౌరవం లేకుండా పోతోందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీకి వెళ్లిన ఆయన ఇటీవల ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశం అయి రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను వివరించారు. ఈ నేపథ్యంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.