కాంగ్రెస్‌లో గుర్తింపు లేదు.. ఇప్పుడు పదవి ఇచ్చినా నేను తీసుకోను!
తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గెలుపు కోసం పార్టీల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు పదునెక్కుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గెలుపు కోసం పార్టీల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు పదునెక్కుతున్నాయి. ఈ క్రమంలో గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణు సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్ రావు థాక్రేతో సమావేశం కావడం ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. అయితే పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారనే విషయాన్ని థాక్రే ఆరా తీశారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం తమకు ఇవ్వడం లేదని మాకు సమాచారం ఇవ్వకుండానే గాంధీ భవన్‌కు రావడం లేదని ప్రచారం చేస్తున్నారని విష్ణు బదులిచ్చినట్లు తెలుస్తోంది.
కొత్త డీసీసీ నియామకానికి సంబంధించిన సమాచారం కూడా తనకు లేదని, పార్టీకి ఉన్నదే రెండు మూడు ఫ్యామిలీలు. వాళ్లను కూడా కలుపుకుపోకుంటే ఎలా అని విష్ణు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కమిటీల్లో ప్రాధాన్యత లేదని అన్ని పదవులు కొత్త వ్యక్తులకే ఇస్తూ పాత వారికి అన్యాయం చేస్తున్నారని థాక్రే దృష్టికి తీసుకువెళ్లారు. పీజేఆర్ లాంటి కుటుంబానికి కూడా పార్టీలో గుర్తింపు లేకుంటే ఎలా తన ఆవేదనను థాక్రే ముందు విష్ణు వ్యక్తం చేశారు. పార్టీ పదవి ఇప్పుడు ఇస్తానన్నా తాను తీసుకోబోనని చెప్పినట్లు సమాచారం. అయితే విష్ణు మాటలను విన్న థాక్రే త్వరలోనే అన్ని సెటిల్ చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా పీసీసీ రేవంత్ రెడ్డికి విష్ణుకు మధ్య పొసగడం లేదని గాంధీ భవన్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తనను సంప్రదించకుండానే తన సోదరి విజయారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై గతంలో రేవంత్‌పై విష్ణు ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరిగింది.