అన్యాయం చేయొద్దు సార్.. రేవంత్ రెడ్డికి OU JAC నేతలు రిక్వెస్ట్
ఓయూ విద్యార్థి నేతలకు అన్యాయం చేయొద్దని జేఏసీ నేతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కోరారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఓయూ విద్యార్థి నేతలకు అన్యాయం చేయొద్దని జేఏసీ నేతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కోరారు. టిక్కెట్ల పంపిణీలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఓయూ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు మూడు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేశామని గుర్తుచేశారు. ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు రెండు టికెట్లు ఇస్తానని రాహుల్ గాంధీ కూడా గతంలో చెప్పారని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ఓయూ జేఏసీ నేతలు మానవతారాయ్, దుర్గం భాస్కర్‌లు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ 2014లో ఒక ఎంపీ 3 అసెంబ్లీ టికెట్లను విద్యార్థి ఉద్యమకారుల కేటాయించిందని, ఆ తర్వాత 2018లో మూడు అసెంబ్లీ టికెట్లు 30 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి విద్యార్థి ఉద్యమకారులను ఆదుకున్నదన్నారు. దీంతోనే ఆ పార్టీ రెండుసార్లు అధికారం సాధించిందని గుర్తుచేశారు. దీంతో ఈ సారైనా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి ఉద్యమకార్లకు టిక్కెట్లు కేటాయిస్తే మంచి మైలేజీ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బాలలక్ష్మి, కురువ విజయ్ కుమార్, డాక్టర్ లింగం యాదవ్, కొనగాల మహేష్ తదితరులు ఉన్నారు.