గెలుపోటములు శాసించగల నేతకు కాంగ్రెస్ గాలం?
పటాన్ చెరు పాలిటిక్స్‌కు సెంటర్ పాయింట్‌గా మారిన నీలం మధు ముదిరాజ్‌పై అధికార, విపక్ష పార్టీలు నజర్ పెట్టాయి. గెలుపోటములను శాసించగల స్థాయిలో ఉండడంతో ‘హస్తం’ పార్టీ ఆయనకు గాలం వేస్తున్నట్లు తెలిసింది.
దిశ, సంగారెడ్డి బ్యూరో: పటాన్ చెరు పాలిటిక్స్‌కు సెంటర్ పాయింట్‌గా మారిన నీలం మధు ముదిరాజ్‌పై అధికార, విపక్ష పార్టీలు నజర్ పెట్టాయి. గెలుపోటములను శాసించగల స్థాయిలో ఉండడంతో ‘హస్తం’ పార్టీ ఆయనకు గాలం వేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు నీలం మధు పార్టీ వీడకుండా అధికార పార్టీ సైతం అన్ని చర్యలూ తీసుకుంటున్నది. అయితే నీలం మధు మాత్రం సీఎంతో పాటు కేటీఆర్, హరీశ్ రావులపై ఇంకా ఆశలు పెట్టుకున్నారు. సీఎం కేసీఆర్ మాట కోసం ఎదురుచూస్తున్నారు.
కొనసాగుతున్న ‘ముదిరాజ్’ల ఆందోళలు
నీలం మధు ముదిరాజ్ బీఆర్ఎస్ నుంచి పటాన్ చెరు టికెట్ ఆశించారు. అయితే ఆ పార్టీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికే మరో సారి అవకాశం కల్పించింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ లకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పై ముదిరాజుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోలనలు ప్రారంభమయ్యాయి. పటాన్ చెరు టికెట్ నీలం మధుకే ఇవ్వాలనే డిమాండ్ వినిపించింది. ముదిరాజ్ ల ఆందోళనలు, దీక్షలు ఇప్పటికీ కొనసాగుతుండగా, అక్కడ కూడా నీలం మధు పేరే వినిపిస్తున్నది.
కాంగ్రెస్ నేతల సంప్రదింపులు!
నీలం మధు ముదిరాజ్ ను తమవైపున తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు నీలం మధు సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనతికాలంలో మంచి గుర్తింపు ఉండడంతోపాటు, యువ నాయకుడిగా పేరుండడంతో కాంగ్రెస్ పార్టీ మధుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.
ఇంకా కేసీఆర్ పైనే ఆశలు
అయితే బీఆర్ఎస్ పార్టీని వదులుకోవడానికి సిద్ధంగా లేనని నీలంమధు ముదిరాజ్ కాంగ్రెస్ నేతలకు సంకేతాలు పంపించినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై నమ్మకం ఉన్నదని ఆయన తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి హరీశ్ రావు నీలం మధుతో మాట్లాడినట్లు తెలిసింది. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే ఈ సారి పటాన్ చెరు నుంచి తనకు అవకాశం కల్పించాలని మధు అభ్యర్థించగా, ఆ అంశం సీఎం కేసీఆర్ పరిధిలో ఉన్నదని మంత్రి చెప్పినట్లు సమాచారం.
గెలుపోటములపై ప్రభావం
నీలం మధు ముదిరాజ్ నిర్ణయంపైనే పటాన్ చెరులో బీఆర్ఎస్, కాంగ్రెస్ విజయం ఆధారపడి ఉంటుందని నియోజకవర్గంలో చర్చ జరుగుతున్నది. ఆయన బీఆర్ఎస్ లోనే ఉంటారా? కాంగ్రెస్ లెకి వెళ్తారా? స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అధికార బీఆర్ఎస్ నుంచి అవకాశం రాకపోతే పార్టీ మారడమో.. లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండడమో చేస్తారని ప్రచారం జరుగుతున్నది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినా గెలుస్తారనే చర్చ సైతం ఉన్నది. దీంతో నీలం మధు అడుగులను ఆయా పార్టీలు నిశితంగా గమనిస్తున్నాయి.