తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ.. ఈ నెలలో రెండు బహిరంగ సభలు
ఎన్నికల పోలింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల పోలింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో టీ బీజేపీ దూకుడు పెంచుతుంది. చేరికలు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. దీంతో పాటు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడంపై దృష్టి పెట్టింది. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. అందులో భాగంగా తెలంగాణలో ప్రధాని మోదీ వరుస పర్యటనలకు సిద్దమవుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో పర్యటించగా.. పసుపు బోర్డుతో పాటు పలు కీలక ప్రకటనలు చేశారు.
అయితే ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రచారానికి మోదీ రానున్నారు. ఈ నెలలో రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మోదీ సభలకు బీజేపీ కసరత్తు చేస్తోంది. త్వరలోనే మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు కానుంది. అటు అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
ఈ నెల 27న హుజురాబాద్‌లో అమిత్ షా బహిరంగ సభ నిర్వహించనుండగా.. 14వ తేదీన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, 15న ముషీరాబాద్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి సాద్వీ నిరంజన్ పర్యటించనున్నారు. ఆ తర్వాత 16న మహేశ్వరం నియోజకవర్గంలో రాజ్ నాధ్ సింగ్, 19న మధిర నియోజకవర్గంలో కేంద్రమంత్రి నారాయణస్వామి, 20వ తేదీన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రచారం చేయనున్నారు.