NTR ఆత్మను శాంతింపజేసేది కేసీఆరే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఎంతో ఆప్తుడు, ఎందరో ఆరాధించే నాయకుడు నందమూరి తారక రామారావు అని మంత్రి కేటీఆర్ అన్నారు. విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమగా పేరుతెచ్చుకున్నఎన్టీఆర్ ప్రజలందరి నాయకుడని కొనియాడారు.

Update: 2023-10-01 03:58 GMT

‘దక్షిణ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా హ్యాట్రిక్ సాధించలేదు. నందమూరి తారకరామారావు జీవితంలో ఎన్నో శిఖరాలను అధిరోహించారు. ఆయన మూడోసారి ముఖ్యమంత్రి కాలేదు. ఎన్టీఆర్ చేయకుండా వదిలిపెట్టిన ఓ పనిని ఆయన శిష్యునిగా సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయి హ్యాట్రిక్ సాధిస్తారు. దాంతో ఎన్టీఆర్ ఆత్మ కూడా శాంతిస్తుంది.

‘రామున్ని, కృష్ణున్ని చూడలేదు కానీ.. ఈయనే రాముడు, ఈయనే కృష్ణుడు అనే స్థాయిలో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న మహా నాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన విగ్రహాన్ని, ఆయన పేరిట ఏర్పాటు చేసిన పార్కును ఆవిష్కరించే అదృష్టాన్ని కల్పించిన మంత్రి పువ్వాడకు, స్థానిక మేయర్ నీరజకు ధన్యవాదాలు’ = ఖమ్మం లకారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్

దిశ బ్యూరో, ఖమ్మం: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఎంతో ఆప్తుడు, ఎందరో ఆరాధించే నాయకుడు నందమూరి తారక రామారావు అని మంత్రి కేటీఆర్ అన్నారు. విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమగా పేరుతెచ్చుకున్నఎన్టీఆర్ ప్రజలందరి నాయకుడని కొనియాడారు. శనివారం ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించి పలు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని లకారం ట్యాంకు బండ్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆయన పేరిట ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాముడెట్లుంటాడు, కృష్ణుడు ఎట్లుండాటు అంటే వాళ్లను అయితే చూడలేదు కానీ..ఈయనే రాముడు, ఈయనే కృష్ణుడు అన్నంత స్థాయికి ఎదిగి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానాయకుడు ఎన్టీఆర్ తెలిపారు. ఎవరు ఎన్ని రకాల చరిత్రలు రాసినా, కొన్ని చెరిగిపోని సత్యాలుంటాయన్నారు. భారతదేశ చరిత్రలో తెలుగువారు ఉన్నారని ఎలుగెత్తి చాటిచెప్పింది నందమూరి తారకరామారావేనని స్పష్టం చేశారు. దేశం గుర్తించడానికి కారణం ఆయనేనని ఈ విషయంలో రెండో అభిప్రాయం, రెండో ఆలోచన లేదని వెల్లడించారు.


తెలంగాణ వారికి అస్థిత్వం ఉందని, తెలంగాణ వారికి పరిపాలన చేతనవుతుందని, తెలంగాణ వారికి పౌరుషం ఉందని భారతదేశానికి రుచిచూపించింది బీఆర్ఎస్ అధినేత కేసీఆరేనని గర్వంగా చెబుతున్నాన్నారు. రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా, చరిత్రలో మహనీయుల స్థానం పదిలంగా ఉంటుందని అందులో ఎన్టీఆర్ స్థానం అజరామరంగా ఉంటుందన్నారు. కొంతమందికి పదవులు వన్నెతెస్తాయని, కొందరు పదవులకే వన్నెతెస్తారని ఎన్టీఆర్ రెండో కోవకు చెందినవారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కు ఉన్న పాపులారిటీ, ప్రజల్లో ఆయనకు ఉన్న స్థానం ముందు ఆయన అలంకరించిన ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నదని అభిప్రాయపడ్డారు. తారకరామారావు పేరులోనే ఏదో తెలియని పవర్ ఉందని, ఆ తారక రాముని ఆశీస్సులతో కేసీఆర్ ఆయన శిష్యునిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. రాష్ర్ట ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా హ్యాట్రిక్ సాధించలేదని, నందమూరి తారకరామారావు జీవితంలో ఎన్నో శిఖరాలను అధిరోహించారని, ఆయన చేయకుండా వదిలిపెట్టిన ఓ పని ఆయన శిష్యునిగా సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయి హ్యాట్రిక్ సాధిస్తారని ఎన్టీఆర్ ఆత్మ కూడా శాంతిస్తుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీలేదు..

ఆరు దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని, రైతుబంధు ఎవరో.. రాబందు ఎవరో ప్రజలే ఆలోచించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. . వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం, సత్తుపల్లిలో జరిగిన సభల్లో మాట్లాడుతూ.. ముక్కిమూలుగుతున్న 150 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించరని వాళ్ల అధికారంలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో చేసి చూపిందన్నారు. ఆరు హామీలంటూ ప్రజల్లోకి వస్తున్నారని, ఆ పార్టీకి వారెంటీ లేదని, ఆ పార్టీ నాయకులు ఇచ్చే హామీలకు గ్యారెంటీ లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్ల కిందట ఇచ్చిన పెన్షన్ ఎంత? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పడు ఇస్తున్నదెంత? అంటూ ప్రశ్నించారు. నాడు 200 రూపాయల పెన్షన్ ఇస్తే.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం 4వేల రూపాయలు ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో ఓ కమాండ్.. బెంగుళూరులో న్యూ కమాండ్, ఢిల్లీలో హైకమాండ్ ఉందంటూ దుయ్యబట్టారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అలవి కాని హామీలు ఇస్తుందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పథకాలు అమలు చేయని అక్కడి సర్కార్.. తెలంగాణ పై మాత్రం బీజేసీ అధిష్టానం విషం చిమ్ముతున్నదని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు


పదవులు రాలేదని పార్టీని ఒదిలి..

జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులు పదవులు రాలేదని పార్టీకి ద్రోహం చేశారని పరోక్షంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుపై విమర్శలు గుప్పించారు. ఓడిపోయినా మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని కూడా విస్మరించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీపై అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాడు దేవునిలా, నేడు దుర్మార్గునిలా కనిపిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.

సత్తుపల్లిలో అందరికీ దళితబంధు..

సత్తుపల్లి నియోజకవర్గం మొత్తం దళితబంధు వెంటనే అమలుచేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. స్పెషల్ ఆఫీసర్లను ఏర్పాటు చేసి సాధ్యమైనంత త్వరగా ఈ పథకం అర్హులైన దళితులందరికీ అందజేయనున్నట్లు తెలిపారు. నేడో, రేపో జీవో వస్తుందని అందుకు అనుగుణంగా అర్హులను గుర్తించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలంలో ఉన్న దళితులందరికీ దళితబంధు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

అవకాశ వాదులు వస్తున్నారు..

తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కొంతమంది అవకాశవాదులు వస్తున్నారని వారి మాటలను నమ్మొద్దు అన్నారు. నియోజకవర్గాల్లో డబ్బులు ఇచ్చి ఓటర్లను కొనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటే 420 పార్టీ అని, ఆ పార్టీకే గ్యారెంటీ లేదని... ప్రజలకు ఏం గ్యారంటీ ఇస్తారని ఎద్దేవా చేశారు. అవకాశం రాకపోతే పార్టీలు మార్చే నాయకులు మనకు వద్దని, నియోజకవర్గంలో టికెట్ రాకపోయినా రాములునాయక్ మనకు గ్యారెంటీగా నిలిచారని ఇలాంటివారిని నమ్మాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్, ఎమ్మెల్యేలు రాములు నాయక్, సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, మదన్ లాల్ ఇతర ప్రజాప్రతినిధులు మంత్రి వెంట ఉన్నారు.

Tags:    

Similar News