కాంగ్రెస్‌లోకి కోట శ్రీనివాస్.. ఖర్గే సమక్షంలో చేరిక!
తెలంగాణ విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఓయూ-జేఏసీ, తెలంగాణ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ కోట శ్రీనివాస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో చేవెళ్ళ బహిరంగసభలో కాంగ్రెస్‌లో చేరనున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఓయూ-జేఏసీ, తెలంగాణ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ కోట శ్రీనివాస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో చేవెళ్ళ బహిరంగసభలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని డిమాండ్ తెరమీదకు రాకముందే 1998లో తెలంగాణ జన సభ కార్యకలాపాల్లో విద్యార్థిగా క్రియాశీలంగా పాల్గొని రాష్ట్ర సాధన నినాదాన్ని వినిపించారు. ఆ తర్వాత వరంగల్ డిక్లరేషన్‌లోనూ పలువురిని ఈ దిశగా కదిలించారు. తెలంగాణ విద్యార్థి సంఘాన్ని 2006లోనే స్థాపించి రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించి ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కోట శ్రీనివాస్ పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం అదే సబ్జెక్టులో పీహెచ్‌డీ చేస్తున్నారు.
రాహుల్‌గాంధీ పిలుపుతో :
బీఆర్ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగడుతూ ఉన్న శ్రీనివాస్ ఇప్పుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి నాయకుడిగా, ఉద్యమకారుడిగా గుర్తింపు పొందిన శ్రీనివాస్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఉన్మాద శక్తులు పెట్రేగిపోతున్నాయని వ్యాఖ్యానించిన రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర తలపెట్టారని, ఈ స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. వందలాది మంది విద్యార్థుల, యువత త్యాగాలతో వచ్చిన తెలంగాణను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నదంటూ రాహుల్‌గాంధీ పిలుపునిచ్చి రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానించారని, అమరుల ఆశయాల సాధన కోసం ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతాంగం, యువత, విద్యార్థులు, దళితులు, నిరుద్యోగులు, బహుజనులు, ఆదివాసీలు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, సబ్బండ వర్ణాల సాధికారత కోసం, వారి న్యాయం కోసం పోరాడాలనే స్పిరిట్‌తోనే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వివరించారు.
విద్యార్థి నాయకుడిగా, సామాజిక సమస్యలపై గొంతెత్తే సోషల్ యాక్టివిస్టుగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన కోట శ్రీనివాస్ (40) టీనేజ్ వయసు నుంచే ఉద్యమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల నిర్బంధాలకు వ్యతిరేకంగా గొంతెత్తినందుకు ఆరు నెలల పాటు ‘ఉపా’ చట్టం కింద కేసులు ఎదుర్కొంటూ జైలుజీవితం గడిపారు. ఉద్యమాల గడ్డగా, సింగరేణి పొలికే వినిపించే పెద్దపల్లి జిల్లాలోని ఒక పేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ ఆదివాసీలు, గిరిజనులు, రైతులు, ప్రాజెక్టు ముంపు బాధితులు, నిర్వాసితులు, మహిళలపై నేరాలు.. లాంటి అనేక సమస్యలపై రాష్ట్రస్థాయిలో ఉద్యమాలు నడిపి గుర్తింపు పొందారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఉద్యమ ఫలాలు సాకారం కాలేదని, ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదంటూ అనేక రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఓపెన్‌గానే మాట్లాడేవారు. విద్యార్థులను ఒక్కతాటి మీదకు తేవాలనే లక్ష్యంతో 2009లోనే తెలంగాణ స్టూడెంట్స్ జేఏసీ, ఉస్మానియా వర్శిటీ జేఏసీలను స్థాపించి చొరవ తీసుకున్న శ్రీనివాస్ ఇప్పటికీ వాటికి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షతో ఏర్పడిన తెలంగాణ ప్రజా ఫ్రంట్‌లో 2015 నుంచి ఈసీ సభ్యుడిగా కంటిన్యూ అవుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్నాచౌక్ ఎత్తివేస్తే దాన్ని తిరిగి సాధించుకోడానికి జరిగిన ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్నారు.