సేవ చేయ‌డానికే వ‌చ్చా.. డోర్నక‌ల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తా

డోర్నక‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప‌టిష్టమైన కేడ‌ర్ ఉంద‌ని, నేత‌లంతా ఏక తాటిపైకి వ‌స్తే పార్టీ గెలుపు సుల‌భ‌మేన‌ని కిసాన్ ప‌రివార్ అధినేత భూపాల్‌నాయ‌క్ స్పష్టం చేశారు.

Update: 2023-08-24 16:03 GMT

దిశ‌, మ‌రిపెడ: డోర్నక‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప‌టిష్టమైన కేడ‌ర్ ఉంద‌ని, నేత‌లంతా ఏక తాటిపైకి వ‌స్తే పార్టీ గెలుపు సుల‌భ‌మేన‌ని కిసాన్ ప‌రివార్ అధినేత భూపాల్‌నాయ‌క్ స్పష్టం చేశారు. డోర్నక‌ల్ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ టికెట్‌ను ఆశిస్తున్న భూపాల్‌నాయ‌క్ గ‌త కొంత‌కాలంగా క్యాడ‌ర్‌ను స‌మాయ‌త్తం చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే నియోజ‌క‌వ‌ర్గంలోని ఆయా మండ‌లాల్లోని కాంగ్రెస్ ముఖ్య నేత‌ల‌తో వ‌రుస‌గా స‌మావేశాలు నిర్వహిస్తూ వ‌స్తున్నారు. గురువారం సీరోలు మండ‌లంలోని కామేప‌ల్లి గ్రామంలోని రఘురాం రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో కుర‌వి, సీరోలు మండ‌లాల‌కు చెందిన కొంత‌మంది ముఖ్య నేత‌ల‌తో స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంపై స‌మాలోచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా భూపాల్‌ నాయ‌క్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బ‌ల‌మైన కేడ‌ర్ ఉంద‌ని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలోని నేత‌లు స‌మ‌న్వయంతో ప‌నిచేస్తే నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని అన్నారు.

పార్టీ కేడర్‌ను నిర్మించుకునే బాధ్యత త‌న‌ భుజస్కంధాల‌పై వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని అన్నారు. ఎవ‌రితోనైనా క‌లిసి ప‌నిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని స్పష్టం చేశారు. త‌న‌పై కాంగ్రెస్ పార్టీ కార్యక‌ర్తలు న‌మ్మకం ఉంచాల‌ని, కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత త‌న‌ద‌న్నారు. ఈ కార్యక్రమానికి రావలసిందిగా మాలోతు నెహ్రూ నాయక్, రామచంద్రనాయక్ కూడా సందేశం పంపించిన‌ట్లు ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు. అనివార్య కారణాల‌తో వారు రాలేక‌పోయార‌ని భూపాల్‌నాయ‌క్ పేర్కొన‌డం విశేషం. తాను రాజ‌కీయాల్లోకి సేవ చేయ‌డానికే వ‌చ్చాన‌ని.. ఇకేం ల‌క్ష్యాలు త‌న‌కు లేవ‌ని అన్నారు. డోర్నక‌ల్ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరుతూ ఇటీవ‌ల ఆయ‌న కాంగ్రెస్ అధిష్ఠానానికి దర‌ఖాస్తు చేసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా భూపాల్‌నాయ‌క్ త‌న రాజ‌కీయ ప‌ర్యట‌న‌ల‌తో డోర్నక‌ల్ కాంగ్రెస్‌లో హీట్ పెంచుతున్నారు.

Tags:    

Similar News