పేదల కడుపు నింపడమే మాకు తెలుసు: ఖర్గే
చెప్పిందే చేస్తాం.. చేయగలిగిందే చెప్తాం.. అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు ఆనాడు విముక్తి కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేసిన ఖర్గే.. తెలంగాణను ఒక ప్రత్యేక రాష్ట్రం చేసిందీ అదే పార్టీ అని నొక్కిచెప్పారు.
దిశ, తెలంగాణ బ్యూరో: చెప్పిందే చేస్తాం.. చేయగలిగిందే చెప్తాం.. అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు ఆనాడు విముక్తి కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేసిన ఖర్గే.. తెలంగాణను ఒక ప్రత్యేక రాష్ట్రం చేసిందీ అదే పార్టీ అని నొక్కిచెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. చెప్పింది చేస్తామనే కమిట్‌మెంట్ కాంగ్రెస్‌కే సాధ్యమన్నారు. తెలంగాణలో తొమ్మిదేళ్ళుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం హామీలు ఇవ్వడమే తప్ప అమలులో ఆ చిత్తశుద్ధి లేదని వేలెత్తి చూపారు. నగరంలో రెండు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ముగిసిన తర్వాత తుక్కుగూడలోని విజయభేరి సభలో ప్రసంగిస్తూ ఖర్గే పై వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల కోసమే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందిన ఖర్గే గుర్తుచేశారు. పదేళ్ళు అధికారాన్ని కోల్పోయినా బాధపడలేదన్నారు. అధికారం కోసం పార్టీ ఈ నిర్ణయం తీసుకోలేదని, ప్రజల త్యాగం, ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకునే సాహసం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలు వారి జీవితాలు బాగుపడతాయని అనుకున్నారని, కానీ కేసీఆర్ పాలనతో ఆ పదేళ్ళ కాలం వృథా అయిందన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్నదని, కానీ కేసీఆర్ తన తొమ్మిదేళ్ళ పాలనలో ఈ రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపించారని, అవినీతిలో కూరుకుపోయేలా చేశారని విమర్శించారు.
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం :
యూపీఏ పాలనలోని పదేండ్లలో గ్రామీణ ఉపాధి హామీ, ఫుడ్ సెక్యూరిటీ లాంటి చట్టాలను తెచ్చి పేదల కడుపు నింపామని, ఇప్పుడు కర్ణాటకలోనూ అన్ని సెక్షన్ల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఐదు గ్యారంటీలను ప్రకటించి అమలు చేస్తున్నామన్నారు. వంద రోజుల్లోనే సాకారం చేసిన నిజాయితీ, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకే చెందుతుందన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీల తరహాలోనే తెలంగాణలో ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ దురదృష్టకరమేమంటే... తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది తామేనంటూ ప్రపంచానికి కొద్దిమంది గొప్పలు చెప్పుకుంటున్నారని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి ఖర్గే వ్యాఖ్యలు చేశారు.
ఆరు గ్యారంటీల్లో రైతు భరోసా :
తెలంగాణకు కాంగ్రెస్ రూపొందించిన ఆరు గ్యారంటీలలో మొదటిదైన ‘మహాలక్ష్మి’ని స్వయంగా సోనియాగాంధీ ప్రకటించారని గుర్తుచేశారు. రైతుభరోసా స్కీమ్ (గ్యారంటీ) ద్వారా పట్టాదారులైన రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి సంవత్సరానికి రూ. 15 వేల చొప్పున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక సాయం (పంట పెట్టుబడి కోసం) చేస్తుందని, రైతు కూలీలకు ఏటా రూ. 12 వేల చొప్పున సాయం అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం గురించి పట్టుబట్టారని, అందులో భాగంగానే రైతుభరోసా గ్యారంటీని ప్రకటిస్తున్నామన్నారు. ఈ స్కీమ్ కిందనే వరి పండిస్తున్న రైతులకు ఒక్కో క్వింటాకు కనీస మద్దతు ధరకు అదనంగా రూ. 500 చొప్పున బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల అవినీతి పాలన :
అత్యంత అవినీతి ప్రభుత్వాల్లో తెలంగాణ టాప్ స్థానాల్లో ఉన్నదని వ్యాఖ్యానించిన మల్లికార్జున్ ఖర్గే... ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల కుప్పగా మారిపోయిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు భూములు ఇచ్చి ఆదుకోడానికి బదులుగా వారికి గత ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్ని లాక్కున్నదని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్ పెట్టాల్సి ఉన్నప్పటికీ అది ఆచరణకు నోచుకోలేదన్నారు. గత ఆర్థిక సంవత్సరానికే రాష్ట్ర అప్పు రూ. 3.67 లక్షల కోట్లకు చేరుకున్నదన్నారు.
మోడీ, కేసీఆర్ ఒక్కటే :
కేంద్రంలో ప్రధానిగా ఉన్న మోడీ, రాష్ట్రంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ఒక్కటేనని, వారిద్దరి పాలసీలు, పాలన ఒకే తీరులో ఉన్నాయన్నారు. వీరిద్దరి ఏలుబడిలో కొన్ని సారూప్యతలు ఉన్నాయన్నారు. బైటకు ఇద్దరూ వేర్వేరుగా ఉన్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం ఒకటేనని అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్‌గా పనిచేస్తున్నదన్నారు. అందుకే బీజేపీకి అవసరమైన అన్ని సందర్భాల్లో బీజేపీ జై కొడుతున్నదన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలో ఇద్దరూ పోటీపడుతున్నారని అన్నారు. అక్కడ నల్లధనం వాపస్ (రూ. 15 లక్షల కోట్లు), ఏటా రెండు కోట్ల ఉద్యోగాలంటూ ప్రజలకు హామీ ఇచ్చిన మోడీ ఒక రకమైన మోసం చేస్తే రాష్ట్రంలో ఎడాపెడా వాగ్ధానాలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఇద్దరూ అబద్ధాలతో మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. వారిద్దరినీ ఓడించడం ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
విజయభేరి సభకు వచ్చిన ప్రజల ఉత్సాహాన్ని చూసిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని వారు ఆమోదం తెలిపారనే భావన కలుగుతున్నదని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇద్దరు మోసగాళ్ళ స్వభావాన్ని తెలుసుకుని ప్రజలు వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చైతన్యంతో, హుషారుగా ఉంటూ ఓటు వేయాలని అప్పీల్ చేశారు. ఇక్కడ కేసీఆర్‌ను, అక్కడ మోడీని ఓడించాలని పిలుపునిచ్చారు. రైతులు, యువత, ఎస్సీ/ఎస్టీ ప్రజలు, మహిళలు, విద్యార్థులు.. ఇలా అన్ని సెక్షన్ల ప్రజల సంక్షేమ, అభివృద్ధి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని, ఆ నమ్మకంతో రెండు చోట్లా కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.