రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ.12 వేలు..?
ఎన్నికల వేళ బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. రేపు మిగిలిన ఐదు
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. రేపు మిగిలిన ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో పాటు 119 నియోజకవర్గాల అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీఫారంలు అందించనున్నారు. దీంతో పాటు రేపు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను సీఎం కేసీఆర్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేయగా.. ఆ హామీలకు పోటీగా రేపు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను విడుదల చేస్తోంది. ఈ మ్యానిఫెస్టోలో పలు కీలక హామీలు ఇవ్వనున్నారు.
మహిళలకు పలు కీలక హామీలను మ్యానిఫెస్టోలో బీఆర్ఎస్ ఇవ్వనుందని తెలుస్తోంది. అలాగే రైతులకు కూడా పలు హామీలు ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రధానంగా మహిళా ఓటర్ల టార్గెట్‌గా పలు హామీలు ఉంటాయని తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందనే విషయంపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు మేనిఫెస్టోను తెలంగాణ భవన్‌లో కేసీఆర్ విడుదల చేయనున్నారు. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా ఈ మ్యానిఫెస్టో ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
రైతుబంధు, ఆసరా ఫించన్ల పెంపుపై మ్యానిఫెస్టోలో హామీ ఉంటుందని తెలుస్తోంది. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సాయం పెంపుపై కూడా హామీ ఉంటుందని సమాచారం. రైతుబంధు పథకం ద్వారా ప్రస్తుతం ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు పెట్టుబడి సాయం కింద ఇస్తుండగా.. దానిని రూ.12 వేలకు పెంచనున్నారని తెలుస్తోంది. అలాగే కేసీఆర్ కిట్ కింద ఇస్తున్న రూ.12 వేలను రూ.15 వేలు పెంచుతూ మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వనున్నారు.