కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించిందే ఆయన.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ అందరినీ ఆదుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు. సోమవారం గాంధీభవన్‌లో కొత్తకోట సీతా దయాకర్ రెడ్డిని ఆయన కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అందరినీ ఆదుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు. సోమవారం గాంధీభవన్‌లో కొత్తకోట సీతా దయాకర్ రెడ్డిని ఆయన కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలోనూ పాలమూరు వలసలు ఆగలేదని, అభివృద్ధి జరగలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 31 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కేవలం ఒక్క పంప్‌ను ప్రారంభించి ప్రాజెక్టు పూర్తి చేసినట్లు బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుందని ఫైర్ అయ్యారు. అందుకే ప్రజల్లో మార్పు మొదలుకావాల్సిన అవసరం ఉన్నదన్నారు. "గతంలో నేను ఎమ్మెల్సీగా గెలిచేందుకు దయాకర్ రెడ్డి అండగా నిలబడ్డారు. నా రాజకీయ ఎదుగుదలలో ప్రతీసారి నాకు అండగా నిలబడ్డారు. 2009లో టీడీపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నప్పుడు పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించారు. అప్పుడు కేసీఆర్ గెలుపులో కొత్తకోట దయాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు" అని రేవంత్ అన్నారు.
గతంలో సీతా దయాకర్ రెడ్డి జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు దేవరకద్రను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఇప్పుడు కాంట్రాక్టులు, కమీషన్లు తప్ప ఎమ్మెల్యేకు దేవరకద్ర అభివృద్ధి పట్టడంలేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నేతలకు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోందని, సీతక్కను కూడా రాజకీయంగా అన్ని రకాలుగా పార్టీ ఆదుకుంటుందని భరోసానిచ్చారు. ఈనెల 16,17,18న సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, ఇతర జాతీయ నాయకులు రాష్ట్రానికి వస్తున్నారని, ఇది కాంగ్రెస్‌కు అత్యంక కీలకమైన రోజులని రేవంత్ పేర్కొన్నారు.
విజయభేరీ సభావేదికకు భూమిపూజ
ఈనెల 17న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో విజయభేరి సభ నిర్వహించనున్న నేపథ్యంలో సభా వేదిక ఏర్పాటు కోసం సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మధుయాష్కి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రౌండ్‌ను సందర్శించి.. సభా వేదిక, ఇతర ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేరారు.