తెలంగాణ ప్రజలు నా కుటుంబ సభ్యులు: రాహుల్ గాంధీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజాభేరి సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. అసలు ఈ సభకు నా చెల్లి ప్రియాంక గాంధీ రావాల్సి ఉందని..
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజాభేరి సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. అసలు ఈ సభకు నా చెల్లి ప్రియాంక గాంధీ రావాల్సి ఉందని.. కానీ, చెల్లికి ఆరోగ్యం బాగోలేక తాను వచ్చానని చెప్పారు. చెల్లి ప్రియాంక రాలేని పక్షంలో నా కుటుంబ సభ్యుల కోసం వచ్చానని రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ చేతిలో మోసపోయారని అన్నారు. మహిళలు, నిరుద్యోగుల బాధలు వర్ణణాతీతం అని వెల్లడించారు. ధరణి పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను కాజేశారని కీలక ఆరోపణలు చేశారు. ధరణి పోర్టల్ వల్ల లాభం జరిగింది కేవలం కల్వకుంట్ల కుటుంబానికే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయని అన్నారు. ప్రజల ధనం మొత్తం కల్వకుంట్ల కుటుంబానికే వెళ్తోందని తెలిపారు. తెలంగాణలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు నిర్మించిందని గుర్తుచేశారు. నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, సింగూర్ ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రజలు-దొరల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. ఈ యుద్ధంలో ప్రజలే గెలవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని అన్నారు. ప్రభుత్వంలోని కీలకమైన శాఖలు రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలు కేసీఆర్ చేతుల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం సాధించుకున్నది దొరల కోసం కాదని.. ఆ పరిస్థితిని మార్చి ప్రజలే పాలించే రోజులు రావాలంటే అది మళ్లీ కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.
Read More..