రెండు స్థానాల్లో కేసీఆర్ పోటీ.. ఈటల రాజేందర్ నిర్ణయంపై ఉత్కంఠ

పదేళ్లుగా గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కేసీఆర్ ఫస్ట్ టైమ్ రెండో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

Update: 2023-08-22 03:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్లుగా గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కేసీఆర్ ఫస్ట్ టైమ్ రెండో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. అయితే గజ్వేల్‌లో తానే పోటీ చేస్తానని గతంలో బీజేపీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇప్పుడు బీఆర్ఎస్ లిస్టులో కేసీఆర్ ఆ స్థానం నుంచి పోటీ చేయడం ఖరారు కావడంతో ఈటల ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తొలుత ప్రకటించినట్లుగా గజ్వేల్ నుంచి ఈటల పోటీ చేస్తారా లేక తప్పుకుంటారా అనే చర్చలు మొదలయ్యాయి. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఢీకొనే శక్తి ఉంటుందా? బీజేపీ అందుకు సమ్మతిస్తుందా? తదితర అంశాలపై క్లారిటీ రావాల్సి ఉన్నది.

హుజూరాబాద్‌ను వదలుకుంటారా?

పార్టీలో కేసీఆర్‌కు సమ ఉజ్జీగా కొనసాగిన ఈటల రాజేందర్ గజ్వేల్‌లో పోటీ చేసే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కాలమే తేల్చనున్నది. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గానికి (డీలిమిటేషన్‌కు ముందు కమలాపూర్ నియోజకవర్గం) ప్రాతినిధ్యం వహించిన ఈటల రాజేందర్ ఒకవేళ గజ్వేల్ నుంచి పోటీ చేయాలనుకుంటే దాన్ని వదిలేసుకుంటారా?.. లేక కేసీఆర్ తరహాలోనే రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉన్నది. పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేసే విషయంలో కేసీఆర్‌తో తలపడితే ఎలాంటి విజయావకాశాలు ఉంటాయన్నది కూడా ఆయన ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది.

ఈటల నిర్ణయంపై ఆసక్తి..

కేసీఆర్‌ను వ్యక్తిగతంగా సవాల్ చేస్తూ ‘బీసీ బిడ్డ’, ‘ఆత్మగౌరవం’ నినాదాలను ఈటల తెరపైకి తెచ్చారు. అభివృద్ధి మంత్రంతో కేసీఆర్ ఆ నియోజకవర్గంలో పాపులర్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలు, ‘బీ-టీమ్’ అనే ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్ తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నది. పదేండ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కేసీఆర్‌ను ఈటల రాజేందర్ ఫస్ట్ టైమ్ అక్కడి నుంచి పోటీ చేసి నిలువరించగలరా అనేది కూడా చర్చల్లో నలుగుతున్నది. ఇంతకాలం రాజకీయంగా కేసీఆర్‌ను ఈటల సవాల్ చేసినా బీఆర్ఎస్ జాబితా విడుదలైన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News