జనారెడ్డి దరఖాస్తుపై చర్చ.. పోటీ చేస్తారా? దూరంగా ఉంటారా?
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి కాంగ్రెస్ టిక్కెట్ కోసం ఇప్పటి వరకు దరఖాస్తు చేయలేదని సమాచారం. నాగార్జున సాగర్నియోజకవర్గం ఇంచార్జీగా ఉన్న ఆయన దరఖాస్తు చేయకపోవడం ఆ పార్టీ వర్గాల్లో హాట్ టాఫిక్అయింది.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి కాంగ్రెస్ టిక్కెట్ కోసం ఇప్పటి వరకు దరఖాస్తు చేయలేదని సమాచారం. నాగార్జున సాగర్నియోజకవర్గం ఇంచార్జీగా ఉన్న ఆయన దరఖాస్తు చేయకపోవడం ఆ పార్టీ వర్గాల్లో హాట్ టాఫిక్అయింది. అయితే ఆ స్థానంలో చిన్న కొడుకు జై వీర్ రెడ్డి గురువారం దరఖాస్తు చేయడంతో జనారెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేస్తారా? చేయరా? అనే అనుమానాలు పార్టీలో మొదలయ్యాయి. అప్లికేషన్‌కు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో చాలా మంది నేతలు జానారెడ్డి నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి శుక్రవారం మిర్యాలగూడ టిక్కెట్ కోసం దరఖాస్తు చేయనున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో జానారెడ్డి కూడా గాంధీభవన్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన తన టిక్కెట్ కోసం ఆప్లై చేస్తారా? కేవలం కొడుకు ప్రాసెస్ కోసం వస్తారా? అనేది కూడా ఈ రోజు తేలిపోనున్నది.
శ్రావణ శుక్రవారం సెంటిమెంట్..
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల అప్లికేషన్స్ గడువు ఈ రోజుతో ముగియనున్నది. దీంతో నేతలంతా దరఖాస్తుకు క్యూ కట్టే ఛాన్స్ ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా శ్రావణ శుక్రవారం కావడంతో సెంటిమెంట్ చాలా మంది నేతలు ఈ రోజు అప్లై చేసే ఛాన్స్ ఉన్నదని పార్టీ భావిస్తున్నది. ఇక ఈనెల 18 నుంచి ఇప్పటి వరకు సుమారు 700 కు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. గురువారం ఒక్కరోజే 200 దరఖాస్తులు చేరాయి. వీటిలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కొడంగల్‌తో సహా జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి, జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య, కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ, జానారెడ్డి కొడుకు రఘు వీర్, రమ్యారావు తదితరులు ఉన్నారు.