బీఆర్ఎస్ గెలుపుపై జమిలి ఎఫెక్ట్.. KCR ప్లాన్‌ను పటాపంచలు చేసిన మోడీ సర్కార్..!

జమిలి ఎన్నికలకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ.. బీఆర్ఎస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఓటర్ల మైండ్‌సెట్‌లో మార్పు వస్తుందని పార్టీ భావిస్తున్నది.

Update: 2023-09-02 02:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జమిలి ఎన్నికలకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ.. బీఆర్ఎస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఓటర్ల మైండ్‌సెట్‌లో మార్పు వస్తుందని పార్టీ భావిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించే స్థానిక అంశం పక్కకు పోయి లోక్‌సభ ఓటింగ్‌లో వ్యక్తమయ్యే జాతీయ అంశమే డామినేట్ చేస్తుందేమోననే గుబులు మొదలైంది. ఓటర్ల మైండ్‌సెట్‌పైనా, పోలింగ్ పాటర్న్ పైనా ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి.

పార్టీ అధినేత సైతం ఇదే తరహా ఆందోళనకు గురవుతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. జమిలి వల్ల రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనంత మ్యాజిక్ ఫిగర్ వస్తుందో రాదోననేంత స్థాయిలో కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి.

ఎలాంటి ముందస్తు ప్లానింగ్‌ లేకుండా కేంద్రం వేసిన జమిలి అడుగులు.. బీఆర్ఎస్‌ను గందరగోళంలోకి నెట్టింది. కాంగ్రెస్, బీజేపీలను కార్నర్ చేయడానికి ఆ పార్టీల కన్నా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి అడ్వాన్స్ మోడ్‌లోకి వెళ్లిపోయామని భావిస్తున్న తరుణంలో ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లు.. గులాబీ యాక్షన్ ప్లాన్‌ను పటాపంచలు చేసినట్లయింది.

జాతీయ, స్థానిక అంశాల ప్రయారిటీల్లో మార్పు వచ్చి అది ఎలాంటి చేటు చేస్తుందోననే గుబులు బీఆర్ఎస్ నేతల్లో మొదలైంది. జమిలి కారణంగా అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యమైతే ఎలాంటి ముప్పు ఎదురవుతుందోననే భయం ఆ పార్టీ అభ్యర్థులను వెంటాడుతున్నది. పార్టీ అధినేత స్ట్రాటెజీపైనే ఇప్పుడు క్యాండిడేట్లు, జిల్లా పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు.

మ్యాజిక్ ఫిగర్‌పైనే అనుమానం:

ఈసారి ఎన్నికల్లో గతం కన్నా నాలుగైదు సీట్లు ఎక్కువే వస్తాయని, 95-105 స్థానాల్లో విజయం సాధిస్తామని కేసీఆర్, కేటీఆర్ పలు సందర్భాల్లో ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందనే జనరల్ టాక్ రాష్ట్రంలో వినిపిస్తున్నది. కేసీఆర్ మాత్రం‌ దానిని పైకి కనిపించనీయకుండా తనదైన శైలిలో వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. పక్కా వ్యూహం ప్రకారం ఇతర పార్టీల కన్నా ముందే అభ్యర్థులను ప్రకటించారు.

కానీ ఇప్పుడు జమిలి కదలికతో గులాబీ బాస్ ఆలోచనలో పడ్డారని, కనీసం మ్యాజిక్ ఫిగర్ అయినా వస్తుందో లేదోనని లెక్కలు వేసుకుంటున్నారని సన్నిహితులొకరు తెలిపారు. రెండు ఎన్నికలు వేర్వేరుగా వస్తాయన్న ఆలోచనతో అభ్యర్థుల జాబితాను, క్యాంపెయిన్ వ్యూహాన్ని రూపొందించుకున్న కేసీఆర్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు.

గత ఎంపీ ఎన్నికల్లో తగ్గిన పర్సంటేజీ

గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 47% ఓట్ షేరింగ్‌తో 88 సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంది. కానీ లోక్‌సభ ఎన్నికల నాటికి ఓటు శాతం 41.7%కి తగ్గింది. దీంతో తొమ్మిది ఎంపీ స్థానాలకే గులాబీ పార్టీ పరిమితమైంది. కేవలం 7% ఓట్లతో ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితమైన బీజేపీ.. ఎంపీ ఎన్నికల సమయానికి ఏకంగా 20% ఓట్ షేరింగ్‌తో నాలుగు ఎంపీ స్థానాలు గెలుపొందింది.

కాంగ్రెస్ సైతం అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎంపీ ఎన్నికల నాటికి ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నది. రెండు ఎన్నికలు కలిసి వస్తే జాతీయ అంశమే ప్రధానంగా మారి అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాకు భిన్నంగా ఫలితాలు వస్తాయని కేసీఆర్ అనుమానిస్తున్నట్టు ఆయన సన్నిహితులొకరు గుర్తుచేశారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే పోలింగ్ పర్సంటేజీలో ఈ మార్పు చోటుచేసుకున్నది.

2009లోనూ ఇదే

పాదయాత్రతో ఊహించని మెజారిటీతో 2004లో పవర్‌లోకి వచ్చిన వైఎస్సార్.. 2009 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్‌ కన్నా స్వల్ప తేడాతో బయటపడ్డారని, కానీ అదే సమయంలో లోక్‌సభకు జరిగిన ఓటింగ్‌లో మాత్రం మూడొంతుల మెజారిటీతో ఊహకు అందని తీరులో ఎంపీ స్థానాలను గెల్చుకున్నారని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేస్తున్నారు.

ఒకేసారి అటు అసెంబ్లీకి, ఇటు పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఇప్పుడు కేసీఆర్ గుర్తుచేసుకుంటున్నారని, జమిలి ఎన్నికలతో ఈ తరహా ఫలితాలే వచ్చే అవకాశాలున్నాయని ఆ నాయకుడు గుర్తుచేశారు. అందువల్లనే మ్యాజిక్ ఫిగర్ దాటుతుందా? అనే సందేహంతో కేసీఆర్ ఉన్నారని చెప్పుకొచ్చారు. దీనికి తగినట్టుగా గులాబీబాస్ తన వ్యూహాన్ని మార్చే ఆలోచన చేస్తున్నట్టు పేర్కొన్నారు.

పేచీ అంతా కాంగ్రెస్‌ గ్రాఫ్‌తోనే..

కర్ణాటక రిజల్టు తర్వాత తెలంగాణలోనూ ఆ పార్టీ గ్రాఫ్ పెరిగిందనేది బీఆర్ఎస్ నేతల సాధారణ అభిప్రాయం. బీజేపీ అడ్రస్ గల్లంతైనందున ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్‌నే చూస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత సైతం జగిత్యాల పర్యటనలో కాంగ్రెస్‌తోనే తమకు పోటీ అంటూ వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్ర ప్రభావంతో రాష్ట్ర ఓటర్ల ఆలోచనలో మార్పు వస్తే ఎలా అనే ఆందోళన వ్యక్తమవుతున్నది.

లోక్‌సభ ఎన్నికకు అనుసరించే ప్రయారిటీ ప్రభావం.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై ఎలాంటి ఎఫెక్టు చూపిస్తుందో అనే అనుమానంతో గులాబీ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. బీజేపీ ఎక్కడా పోటీలోనే లేదనే ధీమా సంగతి ఎలా ఉన్నా కాంగ్రెస్‌కు పెరుగుతున్న గ్రాఫ్ జమిలి ఎన్నికలతో ఏం చేటు తెస్తుందోనన్న ఆందోళన బీఆర్ఎస్ అభ్యర్థుల్లో మొదలైంది.

నిత్యవరసర ధరల పెరుగుదల, నిరుద్యోగం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర రూపాల్లో బీజేపీపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, రాష్ట్రంలో బీఆర్ఎస్ పట్ల యూత్, అర్బన్ ఓటర్లలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత.. జమిలి ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు మైనస్‌గా మారి కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జాబితాలో మార్పులు తప్పదా..?

అసెంబ్లీకి, పార్లమెంటుకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతాయన్న ఉద్దేశంతో తనదైన వ్యూహంతో కేసీఆర్ అభ్యర్థుల జాబితాను రూపొందించారు. కానీ ఇప్పుడు రెండూ ఒకేసారి వస్తుండడంతో కొన్ని మార్పులు చేర్పులు అనివార్యం కానున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. లోక్‌సభకు పంపించాలని కొద్దిమంది పేర్లను మనసులో పెట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు దానికి అనుగుణంగా జాబితాను సవరించే ఆలోచన చేయనున్నట్టు సమాచారం.

రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్.. లోక్‌సభకు కూడా పోటీ చేయాలనుకుంటున్నారు. అసెంబ్లీ జాబితా నుంచి కొద్దిమంది అభ్యర్థులు లోక్‌సభ జాబితాలోకి వెళ్లే అవకాశమూ లేకపోలేదు. ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్ పెట్టడం అనివార్యంగా మారింది. తొలి రోజుల్లో బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోసిన కేసీఆర్.. కర్ణాటక అసెంబ్లీ రిజల్టు తర్వాత మొత్తం దృష్టిని కాంగ్రెస్ మీదకు మళ్లించారు.

ఇప్పుడు జమిలి ఎన్నికలతో ఒకేసారి కాంగ్రెస్, బీజేపీలను కార్నర్ చేయడంలోని ఆచరణాత్మక ఇబ్బందులు తలెత్తే చాన్స్ ఉన్నది. మరి బీఆర్ఎస్ గ్రాఫ్ పెంచడానికి కేసీఆర్ కొత్త స్ట్రాటెజీని రూపొందించుకోవడం అనివార్యమవుతున్నది. ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల నెలకొన్న అసంతృప్తి, వ్యతిరేకత జమిలి ఎన్నికలతో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుందేమోననే విషయం గులాబీ బాస్‌ను కలవరపెడుతున్నట్టు ఆ సన్నిహిత నేత వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌కు పెద్ద సవాల్

ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు అనివార్యమైతే స్థానిక, జాతీయ అంశాలను ఓటర్లు విడివిడిగా ఆలోచించేలా ప్రచార క్యాంపెయిన్‌ను భిన్నంగా నిర్వహించడం కేసీఆర్‌కు సవాలుగా మారింది. జాతీయ, స్థానిక ప్రయారిటీలను ఓటర్లు వేర్వేరుగా ఆలోచించేంత చైతన్యాన్ని కల్గించడమే అన్నింటికన్నా అతి పెద్ద ప్రయారిటీగా కేసీఆర్ భావిస్తున్నారు.

ఓటర్ల జాబితాలో సవరణల మొదలు ప్రజల మైండ్‌ను సెట్ చేయడం వరకు కేసీఆర్ అనుసరించే వ్యూహమే ఇప్పుడు కీలకం కానున్నది. 2009, 2018 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల విశ్లేషణకు అనుగుణంగా కేసీఆర్ ఎలాంటి స్టెప్ వేస్తారన్నది నిర్ణయాత్మకం కానున్నది.

Tags:    

Similar News