Telangana Assembly election : సీఎం కేసీఆర్ చేతిలో ఆ నియోజకవర్గ భవిష్యత్తు!
కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎవరు కొనసాగాలో నిర్ణయించే శక్తి సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎవరు కొనసాగాలో నిర్ణయించే శక్తి సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వర రావు ఎన్నికల చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. తప్పుడు అఫడవిట్ సమర్పించిన కేసులో ఈ తీర్పు వెలువడింది. జడ్జిమెంట్ ప్రకారం తనతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించాలని జలగం వెంకట్రావు అటు స్పీకర్ ఆఫీసును, ఇటు ఈసీని సంప్రదించారు.
రాజకీయ నిర్ణయమే కీలకం!
వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడంపై చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసు సెంట్రల్ ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ‘వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. తర్వాత ఎక్కువ ఓట్లు వచ్చిన జలగంను ఎమ్మెల్యేగా గుర్తించాలి. ఈ బాధ్యత ఈసీది కాదు. స్పీకర్‌కు మాత్రమే ఆధికారం ఉంది.’ అని సెంట్రల్ ఈసీని నుంచి క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. ఒకవేళ హైకోర్టు తీర్పు ప్రకారం వనమా ఎన్నికను రద్దు చేసి, జలగంను గుర్తిస్తున్నట్టు స్పీకర్ ఆఫీసు గెజిట్ ఇస్తే ఆ నిర్ణయాన్ని తము గౌరవిస్తామని ఈసీ వర్గాలు అభిప్రాయపడినట్టు సమాచారం.
ఈ పక్రియ మొత్తం రాజకీయ పరంగా జరగాల్సి ఉందని, సీఎం నుంచి మౌఖిక ఆదేశాలు ఉంటే స్పీకర్ ఇప్పటికే జలగంతో ప్రమాణం చేయించేవారని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కామెంట్ చేశారు. అయితే హైకోర్టు తీర్పు తర్వాత జలగం వెంకట్రావు సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదని టాక్ ఉంది. ఒకవేళ జలగంను ఎమ్మెల్యేగా చేయాలని తలుచుకొని ఉంటే తీర్పు వచ్చిన వెంటనే ఆయనకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చేవారు కదా! అనే చర్చ జరుగుతున్నది.
Read More : మాజీ ఎమ్మెల్సీకు గులాబీ గాలం