ఇన్నేళ్లు బీఆర్ఎస్‌లో కంటిన్యూ అయ్యి తప్పు చేశామా?

బీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి పెరుగుతున్నది. అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడమే ఇందుకు కారణమని సమాచారం. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరుతున్న లీడర్లకు పెద్ద ఎత్తున గిఫ్టులు, భారీ ఆఫర్లను గులాబీ పార్టీ అధిష్టానం ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

Update: 2023-10-22 02:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి పెరుగుతున్నది. అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడమే ఇందుకు కారణమని సమాచారం. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరుతున్న లీడర్లకు పెద్ద ఎత్తున గిఫ్టులు, భారీ ఆఫర్లను గులాబీ పార్టీ అధిష్టానం ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్‌లో చేరే లీడర్ స్థాయిని బట్టి గిఫ్టులను అధిష్టానం ఫిక్స్ చేస్టున్నట్టు టాక్. గులాబీ కండువా కప్పుకున్న వెంటనే చేరికల సమయంలో వారితో కుదిరిన ఒప్పందం మేరకు అన్నీ ఇస్తున్నట్టు తెలుస్తున్నది. ఇలా పార్టీలోకి కొత్తగా వస్తున్న లీడర్లను చూసి పాత నేతలు కోపంతో ఊగిపోతున్నారు. ఇంతకాలం పదవులు ఇవ్వకున్నా, అవమానాలు వ్యక్తం చేసినా తాము పార్టీలో కంటిన్యూ అవుతూ తప్పు చేశామా? అని ఫీలవుతున్నారు.

ఇతర పార్టీ నేతలకు గాలం..

బీఆర్ఎస్‌కు చెందిన చాలా మంది నేతలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇందులో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఉన్నారు. దీంతో పార్టీ అధిష్టానానికి భయం పట్టుకున్నది. ఇలా నేతలు వలస పోతుండటంతో.. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదనే సంకేతాలు కేడర్‌లోకి వెళ్లాయి. దీంతో వలసలకు బ్రేకులు వేసేందుకు అధిష్టానం చర్యలు చేపట్టినా ఫలితం శూన్యం. దీంతో ఇతర పార్టీలకు చెందిన నేతలకు గాలం వేసి గులాబీ కండువా కప్పితే బ్యాలెన్స్ అవుతుందని భావించిన అధిష్టానం.. ఆ దిశగా వ్యూహాలు అమలు చేయడం మొదలుపెట్టింది. కాంగ్రెస్, బీజేపీ, తదితర పార్టీలకు చెందిన నేతలతో సంప్రదింపులు జరిపి వారిని పార్టీలో చేర్చుకుంటున్నది. పార్టీలో చేరితే కలిగే ప్రయోజనాలు, ఆఫర్లను ముందే వివరించి పార్టీలో చేరాలని వారిపై ఒత్తిడి తెస్తున్నట్టు టాక్. ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుండటంతో పలువురు ఇతర పార్టీ నేతలు తెలంగాణ భవన్ మెట్లు ఎక్కుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

ఎన్నికల్లో సీనియర్ నేతల ఎఫెక్ట్?

ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి చేరుతున్న లీడర్లకు అధిష్టానం చేస్తున్న రాచమర్యాదలను చూసి పార్టీలోని సీనియర్ లీడర్లు ఆశ్చర్యపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీని వీడే ముందు సదరు లీడర్లు చేసిన ఆరోపణలు, విమర్శలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అదే లీడర్లకు గులాబీ కండువాలను కప్పి బీఆర్ఎస్‌లోకి స్వాగతం పలుకుతుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అసెంబ్లీకి పోటీ చేసే శక్తి ఉన్నా, పార్టీ వీడకుండా కొనసాగుతున్న లీడర్లు అసహనానికి లోనవుతున్నారు. ఇంతకాలంగా పార్టీలో కొనసాగడమే తాము చేసిన తప్పా? అనే భావనలో ఉన్నారు. వీరంతా ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పనిచేస్తారా? అనే చర్చ పార్టీ నేతల్లో మొదలైంది. వీరి ప్రభావం తప్పక పడుతుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News