తెలంగాణ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. ప్రచారకర్తగా ట్రాన్స్‌జెండర్
తెలంగాణ ఎన్నికలపై ఈసీ స్పీడ్ పెంచింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను షురూ చే
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికలపై ఈసీ స్పీడ్ పెంచింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను షురూ చేసింది. ఎన్నికలకు రెండు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో వడివడిగా అడుగులు వేస్తోంది. ఓటర్ల జాబితా తయారీ, బూత్‌ల ఏర్పాట్లపై అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరచూ సమీక్షిస్తున్నారు. అలాగే ఎన్నికల అధికారులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్‌జెండర్‌ను నియమించింది. వరంగల్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ లైలాను ఎంపిక చేసింది. ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు ఎలా చేసుకోవాలనే దానిపై ఎన్నికల కమిషన్‌తో కలిసి లైలా ప్రచారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారకర్తగా సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రెటీలను ఈసీ ఎంపిక చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ ఎన్నికల్లోనూ సినీ, క్రీడా రంగానికి చెందినవారిని ఎంచుకుంటుంది. వీరితో ఓటు హక్కు ప్రాధాన్యతపై ఎన్నికల సమయంలో ప్రచారం చేయిస్తూ ఉంటుంది.
కానీ ఈ సారి వినూత్నంగా ట్రాన్స్‌జెండర్‌ను ఈసీ ఎంపిక చేసింది. వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన లైలా జిల్లాలోని ట్రాన్స్‌జెండర్లకు నాయకత్వం వహిస్తున్నారు. అలాగే జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు కూడా ఆమె చేపడుతున్నారు. అధికారులతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ట్రాన్స్‌జెండర్ల కోసం వారంలో ఒకరోజు ప్రత్యేక క్లినిక్‌ను లైలా ఏర్పాటు చేయించారు. జిల్లాలో దాదాపు 3,600కిపైగా మంది ట్రాన్స్‌జెండర్లు ఉండగా.. వారికి లైలా నాయకత్వం వహిస్తున్నారు.