ఇంటింటికీ మటన్, మందు.. దసరా రోజున పంపిణీకి ఆ పార్టీ ప్లాన్!

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ఓ ప్రధాన పార్టీ భారీగా ప్లాన్ చేసేంది.

Update: 2023-10-22 02:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ఓ ప్రధాన పార్టీ భారీగా ప్లాన్ చేసేంది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు దసరా రోజున ప్రతి ఇంటికీ కిలో మటన్ లేదా చికెన్, మందు పంపిణీ చేసేందుకు వారం రోజులుగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇది కేవలం ఒక గ్రామంలో, నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని భావిస్తున్నది. ఇలా పోలింగ్ నాటికి మరో రెండు సార్లు మటన్ లేదా చికెన్, మందు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

గ్రామాలకు చేరిన లిక్కర్, మేకలు, కోళ్లు

దసరా రోజున మాంసం, మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే లీడర్లకు పంపిణీ బాధ్యతలను సైతం అప్పగించారు. దసరా రోజున ఉదయం 11గంటలలోపు పంపిణీ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం అభ్యర్థులు తమకు నమ్మకస్తులైన లీడర్లతో పది రోజలు క్రితమే సమావేశం అయ్యారు. దసరా కానుకలు అందలేదని ఎవరి నుంచీ ఫిర్యాదులు రావొద్దని స్పష్టం చేసినట్టు టాక్.

ఇన్‌చార్జికి రూ.10 వేలు, పుల్ బాటిల్

ఓటర్లకు మాంసం, మందు పంపిణీ చేసే బాధ్యతలను స్థానిక లీడర్లకు అప్పగించారు. గ్రామం మొత్తం పంపిణీ చేసే పనిని ఒక్కరికే అప్పగిస్తే ఆలస్యం అవుతుందని గ్రహించి.. రెండు, మూడు వార్డలకు ఒక ఇన్‌చార్జిని నియమించారు. అతని ద్వారా ఆయా వార్డుల్లో పంపిణీ చేపట్టేందుకు ప్లాన్ చేశారు. ఈ బాధ్యతలు పూర్తి చేసినందుకు ఒక్కో ఇన్‌చార్జికి రూ.10 వేలతో పాటు ఓ బ్రాండెడ్ కంపెనీ పుల్ బాటిల్‌ను ముందుగానే సరఫరా చేస్తున్నట్టు టాక్.

ఒక్కో సెగ్మెంట్‌లో సుమారు రూ.కోటిన్నర ఖర్చు

మూడు విడతల్లో జరిగే పంపిణీ కోసం ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి రూ.కోటిన్నర వరకు ఖర్చు చేసేందుకు మానసికంగా రెడీ అయినట్టు ప్రచారం జరుగుతున్నది. దసరా రోజున ఒకసారి, నవంబరు రెండో వారంలో ఒకసారి, పోలింగ్‌కు ముందు రోజు చివరి దఫా పంపిణీ చేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. దీపావళికి సైతం భారీ స్థాయిలో గిఫ్టులు రెడీ చేస్తున్నారు.

మరో ప్రధాన పార్టీపై ఒత్తిడి

ఓ పార్టీ చేపడుతున్న మందు, మాంసం పంపిణీ కార్యక్రమం ప్రభావం మరో ప్రధాన పార్టీపై పడింది. ఈ విషయాన్ని ప్రత్యర్థి పార్టీ లోకల్ లీడర్లు.. తమ పార్టీ జిల్లా లీడర్లకు చేరవేశారు. తమ పార్టీ తరఫున సైతం ఎంతో కొంత మాంసం, మందు ఇవ్వాలని ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో సదరు పార్టీకి చెందిన లీడర్లు సైతం పోటీగా గిఫ్టులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే తమ ఆర్థిక సామర్థ్యం మేరకు దీపావళికి స్వీట్స్, టపాసులు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

Tags:    

Similar News