కొంపముంచిన కేటీఆర్ కామెంట్స్.. పడిపోతున్న బీఆర్ఎస్ గ్రాఫ్!

రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నదా ? నెల రోజుల క్రితం ఉన్న పాజిటివిటీ ఇప్పుడు కనిపించడం లేదా ? భవిష్యత్‌లో గ్రాఫ్ మరింత దిగజారి పోనున్నదా ? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానాలు ఆ పార్టీ నేతల నుంచే వస్తున్నాయి.

Update: 2023-09-14 03:53 GMT

దిశ,తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నదా ? నెల రోజుల క్రితం ఉన్న పాజిటివిటీ ఇప్పుడు కనిపించడం లేదా ? భవిష్యత్‌లో గ్రాఫ్ మరింత దిగజారి పోనున్నదా ? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానాలు ఆ పార్టీ నేతల నుంచే వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్ని్కల్లో మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన స్థానాలు దాటడం కష్టమేననే ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది.

సిట్టింగులపై తీవ్ర వ్యతిరేకత

రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. మెజార్టీగా సిట్టింగులకే మళ్లీ టికెట్లు ఇచ్చారు. దీని పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తున్నదని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. 2014 నుంచి ఎమ్మెల్యేల బంధువులు, అనుచరుల ఆగడాలు చూసిన ప్రజలు మళ్లీ సిట్టింగులకే టికెట్ ఇవ్వడంపై వారు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. మరో వైపు సిట్టింగులకే టికెట్ ఇవ్వడంపై అనేక సెగ్మెంట్లలోని పార్టీ కేడర్ జీర్ణించుకోలేక పోతున్నట్టు తెలుస్తున్నది. ఇదే రానున్న రోజుల్లో పార్టీకి పెద్ద మైనస్‌గా మారనున్నది. అభ్యర్థి గెలుపునకు వారంతా కలిసి పని చేయడం కష్టమేననే వాదన బలంగా వినిపిస్తున్నది.

పార్టీ నేతల్లో తగ్గిన ఉత్సాహం

ఆగస్టు 21న సీఎం కేసీఆర్ 115 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించినప్పుడు బీఆర్ఎస్‌లో జోష్​కనిపించింది. మెజార్టీగా సిట్టింగులకే టికెట్ ఇవ్వడంతో వారి అనుచరులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ వాస్తవ పరిస్థితులు మారిపోతున్నాయని, ప్రధానంగా పార్టీ కేడర్‌లో నిరాశ కనిపిస్తునట్టు తెలుస్తున్నది. రెండుసార్లు అధికారంలో ఉన్నా నియోజకవర్గంలో ఉన్న లీడర్లకు ఎలాంటి ప్రయోజనమూ దక్కలేదనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యేల అనుచరులకే పార్టీ, ప్రభుత్వ పదవులు దక్కాయని, తమను గుర్తించలేదని కింద స్థాయి లీడర్లు ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తున్నది.

కేటీఆర్ కామెంట్స్‌తో నిరాశలో అభ్యర్థులు

అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం అవుతాయని మొన్నటి వరకు ప్రచారం మాత్రమే జరిగింది. కానీ ఏప్రిల్, మే నెలల్లో ఎలక్షన్స్ జరుగుతాయని మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్‌తో లీడర్లలో నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. ఈ కామెంట్స్ అభ్యర్థులు, కేడర్‌లో నిరుత్సాహం తెచ్చాయనే టాక్ ఉన్నది. అయితే ఎన్నికలు ఆలస్యంగా జరిగితే పార్టీకి మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన 61 సీట్లు రావడం కష్టమేననే చర్చ సాగుతున్నది. ఇప్పటికే పార్టీ పట్ల ప్రజల్లో నెగిటివిటీ పెరిగి పోతున్నదని, ఇది మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని నేతలు ఆందోళన చెందుతున్నారు.

ప్రచారానికి బ్రేకులు

ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగింది. అప్పటి వరకు నియోజకవర్గానికే పరిమితమైన అభ్యర్థులు ప్రచారానికి బ్రేకులు వేసి హైదరాబాద్‌ బాట పట్టారు. సొంత పనులు చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో అప్పటి వరకు యాక్టివ్‌గా ఉన్న కార్యకర్తల్లో నిరాశ మొదలైంది. ప్రచారానికి వెళ్తే ఎంతో కొంత ఆర్థిక ప్రయోజనం ఉండేదని, ఇప్పుడు అదీ లేకుండా పోయిందనే ఆవేదన వారిలో నెలకొన్నది.

Tags:    

Similar News