ఎన్ని కుంభకోణాలు చేసినా బీఆర్ఎస్‌ను బీజేపీ కాపాడుతుంది: థాక్రే
బీఆర్ఎస్ ఎన్ని స్కాములు చేసినా బీజేపీ కాపాడుతుందని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రే స్పష్టం చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో థాక్రే మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎన్ని స్కాములు చేసినా బీజేపీ కాపాడుతుందని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రే స్పష్టం చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో థాక్రే మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. ఈజీగా మ్యాజిక్ ఫిగర్‌ను చేధిస్తామని తమ ఇంటర్నల్ సర్వేలో తేలింది చెప్పారు. కమ్యూనిస్టులతో చర్చలు, ఆర్. కృష్ణయ్య అంశాలను పీసీసీ చీఫ్, సీఎల్పీ నేతల దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు పలకడానికి చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయని.. ఇప్పటికే తనను చాలామంది కలిశారని.. అందులో మందకృష్ణ మాదిగ, ఆర్.కృష్ణయ్య సహా ఇతర సంఘాల నేతలు కూడా వచ్చారని తెలిపారు.
కానీ, వాళ్లు కాంగ్రెస్‌ను ఎందుకు తిట్టారో తెలియదు అని స్పష్టం చేశారు. డైరెక్ట్‌గా హైకమాండ్ చర్చలు జరపమని చెప్పలేదన్నారు. రాష్ట్రంలో పార్టీకి ఉపయోగపడే విషయాలు పీసీసీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోనే జరుగుతాయన్నారు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో రెగ్యులర్‌గా మాట్లాడుతుంటామని చెప్పారు. లెఫ్ట్ పార్టీలతో అధికారికంగా ఇంకా చర్చలు జరుగలేదని అన్నారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు చర్చలు సీఎల్పీ లీడర్, పీసీసీ ప్రెసిడెంట్ సమక్షంలో జరుగుతాయని తేల్చి చెప్పారు. అధిష్టానం పొత్తుల గురించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటుందన్నారు. సీపీఐతో అనధికార మీటింగ్ జరిగిందన్నారు. అందులో పొత్తుల గురించి, సీట్ల గురించి చర్చ జరగలేదన్నారు. షర్మిల పార్టీ అంశం నా పరిధిలో లేదని, ఆ చర్చ కూడా నాకు తెలవదన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసే ఉన్నాయన్నారు. పైకి మాత్రం విమర్శించుకుంటారన్నారు. అది మైండ్ గేమ్ అని, ఆ బంధం గురించి ప్రజలకు అంతా తెలుసన్నారు.