తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం.. BRSకు చెక్ పెట్టేందుకు తెర వెనుక భారీ స్కెచ్..?
బీఆర్ఎస్‌ను ఎదురించేందుకు రాష్ట్రంలో మరో ప్లాన్ సిద్ధమవుతున్నది. బీజేపీ మినహా విపక్ష పార్టీలన్నీ ఒక్క వేదికమీదకు వచ్చేందుకు ప్రణాళిక రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌ను ఎదురించేందుకు రాష్ట్రంలో మరో ప్లాన్ సిద్ధమవుతున్నది. బీజేపీ మినహా విపక్ష పార్టీలన్నీ ఒక్క వేదికమీదకు వచ్చేందుకు ప్రణాళిక రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం కొన్ని రహస్య సమావేశాలు కూడా జరుగుతున్నట్టు టాక్. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో కొత్త ఊపు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బీఎస్పీ, వైఎస్సార్టీపీ, తెలంగాణ జనసమితి వంటి వేదికలన్నీ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు స్కెచ్ వేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. పొత్తులకు తాము సిద్ధంగా ఉన్నామని.. ఇప్పటికే వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల, టీజేఎస్ అధినేత కోదండరాం సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ వేదిక రాబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండేందుకు, బీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు విపక్ష పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం రహస్యంగా చర్చలు కూడా కొనసాగిస్తున్నాయి. మరి వీరి ప్లాన్‌కు కాంగ్రెస్ ఒప్పుకుంటుందా? విపక్షాలన్నీ ఏకమవుతాయా? అన్నది వేచి చూడాలి. ఈ నెల చివరికల్లా స్టేట్ పాలిటిక్స్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అన్ని పార్టీలూ అలర్ట్
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలూ అలర్టయ్యాయి. అన్ని పార్టీల్లోని అసంతృప్తివాదులు బెటర్ చాన్స్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వివిధ పార్టీల్లోని నేతల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చొరవ మొదలైంది. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్ల చీలికను నివారించే విపక్ష పార్టీలు ఒక్కటవుతున్నాయి. ఈ వ్యవహారం మొత్తం మూడో కంటికి తెలియకుండా గోప్యంగా జరుగుతోంది.
ప్రత్యామ్నాయ వేదికకు వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, పౌర వేదికలు కూడా తగిన సహకారాన్ని ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల చివరికల్లా ఈ వ్యవహారం ఓ కొలిక్కి రానున్నట్టు సమాచారం. అందరినీ ఒక చోటికి చేరే బాధ్యతను ఎవరు భుజాన వేసుకుంటారనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది.
బీజేపీ గ్రాఫ్ డౌన్?
కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ ప్రభావం తెలంగాణలో గణనీయంగా తగ్గిపోయిందన్న వాదన తెరమీదకు వస్తున్నది. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందనే వాదనలు వ్యక్తమువుతన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే తీరులోనే పొలిటికల్ పైట్ ఉండేలా కొందరు విపక్ష లీడర్లు ప్రయత్నిస్తున్నారు.
బీఎస్పీ, వైఎస్సార్టీపీ, తెలంగాణ జనసమితి, వామపక్షాలు.. ఇలాంటి పార్టీలన్నీ వేర్వేరుగా పోటీ చేయడాన్ని నివారించడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నది ఉమ్మడి భావన. విపక్షాల ఓట్ల చీలికను నివారించడం కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నింటినీ సీరియస్‌గా తీసుకుని ముమ్మరం చేయడంపై ఫోకస్ పెరిగింది. వారం రోజుల్లో సంప్రదింపులు మరింతగా పెరగనున్నాయి.