కాంగ్రెస్ పుంజుకోవడంతో బీఆర్ఎస్‌లో భయం.. మరోసారి కేసీఆర్ స్ట్రాటజీ చేంజ్?

రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. ఇది ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా ఉన్నది.

Update: 2023-07-08 03:02 GMT

స్టేట్‌లో ముక్కోణపు పోటీ ఉంటుందని మొన్నటి వరకూ బీఆర్ఎస్‌ భావించింది. కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకున్నది. ఇదే ఇప్పుడు కారు పార్టీని కలవర పెడుతున్నది. కాంగ్రెస్ జోష్‌తో బీజేపీ పోటీలో లేకుండా పోతుందనే ఆందోళన ఆ పార్టీలో పట్టుకున్నది. తమకు రాజకీయంగా మేలు జరగాలంటే త్రిముఖ పోటీ ఉండాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అందుకు బీజేపీకి బూస్టింగ్ ఇచ్చే ప్రోగ్రామ్స్ ఉంటాయని తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. ఇది ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా ఉన్నది. అర్బన్ ఏరియాల్లో తీవ్రంగా, రూరల్ ఏరియాలో మధ్యస్తంగా ఉన్నది. ఇంత కాలం బీజేపీ, కాంగ్రెస్‌లు రెండో స్థానం కోసం పోటీ పడ్డాయి. కానీ కర్ణాటక రిజల్ట్ తర్వాత కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం పార్టీలో చేరారు. దీనికి తోడు కమలం పార్టీలో నెలకొన్న పొలిటికల్ పరిణామాలు కాంగ్రెస్ పార్టీనే బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నయమనే చర్చ జరుగుతున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ద్విముఖ పోటీ ఉంటే కాంగ్రెస్‌కు మైలేజ్ వచ్చే ప్రమాదం ఉన్నదని, అలా కాకుండా పోటీలో బీజేపీ కూడా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలి తమ విజయానికి ఈజీగా ఉంటుందని బీఆర్ఎస్ లీడర్లు భావిస్తున్నారు.

ప్రధాని టూర్ తర్వాత కేసీఆర్ స్ట్రాటజీ చేంజ్?

బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్‌గా మారిందని కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నది. అందుకే రెండు పార్టీల మధ్య పరస్పరం విమర్శలు లేవని గుర్తు చేస్తున్నది. అందులో భాగంగానే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత విచారణ, మంత్రులు, ఎంపీలపై ఈడీ, ఐటీ సోదాలు లేవని ఆరోపిస్తున్నది. ఈనెల 8న వరంగల్‌లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని.. కేసీఆర్ పై ఎలాంటి విమర్శలు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి‌గా మారింది. మోడీ ప్రసంగం తర్వాత కేసీఆర్.. బీజేపీపై రాజకీయ వ్యూహాన్ని మార్చే అవకాశం ఉందనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో సాగుతున్నది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ పోటీలో ఉండి ఉంటే, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్, జేడీఎస్ మధ్య చీలి బీజేపీ‌కి ప్లస్ అయ్యేదని లెక్కలు వేస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ కోసం కాంగ్రెస్‌తో పాటు బీజేపీ పోటీలో ఉండే విధంగా సీఎం కేసీఆర్ స్ట్రాటజీ చేంజ్ చేసే అవకాశం ఉన్నదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News